కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్..! వేటు ఖాయం..?
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఆయన సంగతి తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది హైకమాండ్. పార్టీలోనే ఉన్నానంటారు.. కానీ పార్టీకోసం పనిచేయరు.. హైకమాండ్ కు వీరవిధేయుడిని అంటారు.. కానీ అధిష్టానం మాటను కూడా ఖాతరు చేయరు.. మునుగోడులో పార్టీ ఓడిపోతుందంటారు.. త్వరలో తానే పీసీసీ అధ్యక్షుడిని అంటారు.. ఇలా ఒకటా.. రెండా.. కోమటిరెడ్డి చేసిన తప్పులెన్నో..! అయినా ఎంతో సహనంతో వేచి చూసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీకి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో ప్రచారం కూడా చేయకుండా.. వ్యతిరేకంగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఏఐసీసీ.
కోమటిరెడ్డి కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ పార్టీలో పలుమార్లు కోమటిరెడ్డి సోదరులిద్దరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా విజయం సాధించారు. 2018, 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. పార్టీ అధికారంలో లేకపోయినా హైకమాండ్ కు విదేయులుగానే ఉంటూ వచ్చారు. వై.ఎస్.హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా నడిచింది. వై.ఎస్. మరణానంతరం సోదరులిద్దరూ టీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. పార్టీలోనే ఉంటామని.. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు సీన్ మారింది. కోమటిరెడ్డి సోదరుల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. అదే సమయంలో వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా తాను పట్టించుకోనని.. తాను మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ మాట వింటానని చెప్పుకొచ్చారు. అలాగే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేసేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిద్ధంగా లేరు. అయితే హైకమాండ్ మాట వింటానన్నారు. దీంతో రాహుల్, ప్రియాంక ఇద్దరూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఢిల్లీ పిలిచి మునుగోడులో పార్టీ గెలుపుకోసం పని చేయాలని ఆదేశించారు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఏనాడూ మునుగోడులో అడుగు పెట్టలేదు. అంతేకాదు.. తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర జరుగుతున్నా పాల్గొనలేదు.
పైగా.. మునుగోడు ఉపఎన్నికపై వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలకతీతంగా అందరూ సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫోన్లు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని.. తాను ప్రచారం చేసినా ఉపయోగం లేదని తేల్చేశారు. అదే సమయంలో ఇక్కడ పార్టీ ఓడిపోతే తానే పీసీసీ అధ్యక్షుడినవుతానని ప్రకటించేసుకున్నారు. దీంతో.. ఇన్నాళ్లూ ఓపిక పట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇక ఏమాత్రం ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అది అందిన వెంటనే వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.













