అర్ధం చేసుకుని కేసీఆర్ బయటకు వస్తున్నారు అయితే…?
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలు ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ రావడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ సీరియస్ గా దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని బలంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఒకానొక దశలో సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించి జానారెడ్డిని గెలిపించే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం మరో ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. జానారెడ్డి గెలవడం కంటే కూడా టిఆర్ఎస్ పార్టీ గెలవడం అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్న కీలక నేతలు అందరితో కూడా ఆయనతో మాట్లాడటమే కాకుండా త్వరలో బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు.
ఈనెల 14న హాలియాలో జరుగుతున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2018 తర్వాత సీఎం కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఉప ఎన్నికల్లో అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీకి కేటిఆర్ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం కనబడలేదు. అందుకే ఇప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు.
సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉండటమే కాకుండా ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు నివృత్తి అవుతాయి అని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు కూడా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు నాగార్జునసాగర్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర స్థాయి నాయకులను పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు.













