14న సాగర్ లో కేసీఆర్ సమరశంఖం
తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక హీటెక్కిస్తోంది. 17వ తేదీన జరిగే ఈ బైపోల్ కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారబరిలోకి దిగుతున్నారు. ఈ నెల 14న హాలియా శివారులో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటున్నారు. సభకోసం హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించారు. సభకు అనుమతులకోసం కూడా అప్లై చేశారు. ఈ సభను పెద్దఎత్తున నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సాగర్ నలుమూలల నుంచి జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. పార్కింగ్ కోసమే 30 ఎకరాలను కేటాయించారు.
17వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. 15వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా ఒక రోజు ముందు కేసీఆర్ సభకు ప్లాన్ చేశారు. సాగర్ ఉపఎన్నికకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని భావిస్తున్నారు. ఈ సభకు జనసమీకరణ బాధ్యతను ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు అప్పగించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఎన్నికల ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిబంధనల మేరకు సభ నిర్వహించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. సభకు వచ్చేవాళ్లంతా తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
నాగార్జు సాగర్ టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు ఓటమి అంచువరకూ వెళ్లడంతో గులాబీ శ్రేణులు దీన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని భావిస్తున్నాయి. అయితే అక్కడ బీజేపీతో తలపడిన టీఆర్ఎస్.. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తో కుస్తీ పడాల్సి వస్తోంది. జానారెడ్డి సీనియర్ నేత కావడం.. ఇక్కడ మంచి పట్టు ఉండడంతో కాంగ్రెస్ నే టార్గెట్ గా పెట్టుకుంది గులాబి పార్టీ. అయితే గెలుపుపై ఏమాత్రం అనుమానం లేదని.. భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యమని టీఆర్ఎస్ చెప్తోంది. భారీ బహిరంగ సభ ద్వారా విపక్షాల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి పైచేయి సాధించాలనుకుంటోంది టీఆర్ఎస్.
నాగార్జున సాగర్ లో గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు కేసీఆర్. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. రోజూవారీగా సమీక్ష చేస్తూ ప్రచారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అంతుచిక్కని రీతిలో ప్రచారం సాగుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మున్సిపాలిటీలకు, మండలాలకు వేర్వేరుగా ఇన్ ఛార్జ్ లను నియమించింది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. వాళ్లకు అప్పగించిన బాధ్యతలను నేతలు తమ భుజాలపై వేసుకుని పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బహిరంగసభ తర్వాత సీన్ మారిపోతుందని అంచనా వేస్తున్నారు.













