హ్యాట్రిక్ దక్కేనా…?
కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమా, అర్హులైన పేదలకు సన్నబియ్యం,దశలవారీగా పెన్షన్ల పెంపు సహా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కీలక ప్రతిపాదనలు చేశారు సీఎం కేసీఆర్. తాము ఒట్టిమాటలు చెప్పమని.. చెప్పింది చేసి చూపిస్తామన్నారు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రైతులు.. కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ గోస పడొద్దని సూచించారు. ఇంతకూ మేనిఫెస్టో అంశాలు … బీఆర్ఎస్ నావను గట్టెక్కిస్తాయా? ఇప్పుడిదే అంశం తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ మేనిఫెస్టోలో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. గెలుపు సాధిస్తామని గులాబీనేతలు గట్టిగా చెబుతున్నారు.
బీఆర్ఎస్ భవన్లో కొంతమందికి బీఫామ్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. మిగిలిన నేతలకు ఆయా నియోజకవర్గాల్లో సభల్లో ఇస్తూ వెళ్తున్నారు. అంతే కాదు.. ఆయా నియోజకవర్గాలకు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. బీఆర్ఎస్కు ఓటేయకుంటే .. రైతుబంధు, రైతుబీమా, ధరణి, దళితబంధు, డబుల్ బెడ్రూమ్ లాంటి కీలక పథకాలు అందకుండా పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి.. గులాబీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు కేసీఆర్. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ.. ఇప్పుడు మరోచాన్స్ అంటూ ముందుకొస్తోందని.. ఆపదమొక్కులు మొక్కుతోందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. మళ్లీ గతంలో ఎదుర్కొన్న సమస్యలు తెచ్చుకుంటారా? లేదంటే బీఆర్ఎస్కు ఓటేసి, అభివృద్ధిని కొనసాగించుకుంటారా అన్న అంశాన్ని ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు మిత్రపక్షం మజ్లిస్.. బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. సీఎం కేసీఆర్‌కు తమపార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో అద్భుతమన్న అసదుద్దీన్ ఒవైసీ… కచ్చితంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందుకు దొందేనన్నారు. తాము తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ పోటీ చేస్తామని తెలిపారు అసదుద్దీన్. బీఆర్ఎస్ కూడా.. మజ్లిస్ తమ మిత్రపక్షమని, కలిసే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. పోరు హోరాహోరీగా జరిగే సందర్భంలో మజ్లిస్‌కు ఉన్న ఓటు పర్సంటేజితో గట్టెక్కవచ్చని గులాబీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమ డిక్లరేషన్‌ను కాపీ కొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. తాము చెప్పిన అంశాలకు కొంత కలిపి, ఓ పథకంగా ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతే కాదు.. స్వయంగా ఆలోచించే శక్తిని కేసీఆర్ కోల్పోయారన్నారు. బీఆర్ఎస్ మునుపటిలా స్వయంప్రకాశితం కాదన్నారు. కాంగ్రెస్ గతంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించినప్పుడు.. వాటికి డబ్బులెలా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారని.. ఇప్పుడు వీరి హామీలకు ఎలా సర్దుతారో చెప్పాలన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం సాధ్యమని.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ద్వారా కేసీఆర్ అంగీకరించారన్నారు రేవంత్
అంతేకాదు.. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు డిసైడై పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆరోజు అందరికీ ఆహ్వానముందంటున్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీల కార్డును … ప్రతీ పేదవాడి ఇంటికి వెళ్లి అందించాలని, వారి వివరాలు రాసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు.













