కమలం ఊసెత్తని కేసీఆర్.. తిట్లపై నీళ్లు!
నాగార్జున సాగర్ ప్రచారం ఇవాల్టితో ముగియనుంది. దీంతో సీఎం కేసీఆర్ నిన్న హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా కేసీఆర్ సభ అనగానే అందరిలోనూ ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన ఏది చెప్పినా వినసొంపుగా ఉంటుంది. ప్రత్యర్థులపై తనదైన శైలిలో పంచులు వేయడం కేసీఆర్ నైజం. ఈ సభలో కూడా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరుగుతారని అందరూ ఊహించారు. అయితే కేసీఆర్ ప్రసంగం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది.
హాలియా సభలో కేసీఆర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. జానారెడ్డి ముప్పై ఏళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని 60ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆగమాగం చేసిందని దుయ్యబట్టారు. ఓటేసేటప్పుడు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయాలని సూచించారు. మంచి చేసే ప్రభుత్వానికి ఓటేస్తే మరిన్ని మంచి పనులు జరుగుతాయని సూచించారు. నోముల నర్సింహయ్య వారసుడిగా విద్యావంతుడైన నోముల భగత్ ను అభ్యర్థిగా ఎంపిక చేశామని.. తప్పకుండా మీకు చేస్తాడని కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకే ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు.
అయితే హాలియా సభలో కేసీఆర్ బీజేపీని కనీసం పట్టించుకోలేదు. కమలం నేతలు ఈ మధ్య కాలంలో కేసీఆర్ టార్గెట్ గా అనేక విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కమలాన్ని పల్లెత్తు మాట అనలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రధాని లాంటి నేతలు వెళ్లి ప్రచారం చేయడం కొత్తగా ఉందన్న ఆయన.. ఇలాంటి ఆచారం మంచిది కాదన్నారు. ఇక్కడ కూడా ఆయన బీజేపీ ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నెన్నో విమర్శలు చేశారు. వాటన్నిటికీ కేసీఆర్ సభలో సమాధానం చెప్తారని అందరూ భావించారు. అయితే కేసీఆర్ వాళ్లను లైట్ తీసుకున్నారు. బీజేపీకి నాగార్జున సాగర్ కు అంత సీన్ లేదనుకున్నారో ఏమో ఆ పార్టీ ప్రస్తావన లేకుండానే ప్రసంగం ముగించారు.
అయితే బీజేపీ మాత్రం కేసీఆర్ పై అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. హాలియా సభలో కేసీఆర్ తమపై విరుచుకుపడతారని.. అందుకు తగ్గట్లు కౌంటర్స్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావించారు. అందుకోసం సభ అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టి తిట్టేందుకు విజయశాంతిని సిద్ధం చేశారు. కానీ కేసీఆర్ సభలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో బీజేపీ నేతలే ఖంగుతున్నారు. ఇదేంటిది.. మమ్మల్ని కనీసం పట్టించుకోలేదనే గుసగుసలు ఆ పార్టీలో వినిపించాయి. చివరకు కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలకే విజయశాంతి ప్రెస్ మీట్ పరిమితమైపోయింది. అలా.. బీజేపీ తిట్ల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు.













