‘గులాబీ’ టెన్షన్…
2024 టార్గెట్ గా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి… ఆశావహులు టెన్షన్ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మంది నాయకులున్న నియోజకవర్గాల్లో విభేదాలు అధికమవుతున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో ఎవరికి వారు సొంతవర్గాలను పెంచుకుంటున్నారు. పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కుతున్నారు. అంతేనా.. తమను కాదని ప్రత్యర్థులకు టికెట్ ఇస్తే.. వారిని గెలవనివ్వమని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీల మధ్య… ఎమ్మెల్యేలకు, జడ్పీ ఛైర్మన్ల మధ్య… ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య టికెట్ల కోసం ఫైట్ జరుగుతోంది. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలపై ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ సమస్యలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై వరుసగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం, శ్రీహరీ గట్టిగానే ప్రతి విమర్శలకు దిగడంతో వివాదం తీవ్రమైంది. దాంతో రాజయ్యను కేటీఆర్ పిలిపించి మాట్లాడాక వాతావరణం ప్రస్తుతానికి సద్దుమణిగింది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోనూ విభేదాలు ఉన్నాయి. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఆయన కూతురే కేసులు పెట్టడం, నాయకుల మధ్య విభేదాల నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్సీ ఒకరికి ఈ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి వర్గీయులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి కోవా లక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఖానాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కూడా అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ముథోల్, నిర్మల్లలోనూ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.
వేములవాడలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్‌బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ… ఇటీవల నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. పలువురు బహిరంగంగా తమతమ గ్రూపులతో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, పలుచోట్ల చాపకింద నీరులా చేసుకుంటూ వెళుతున్నారు.
ఈ అసంతృప్తులు, ఆశావహుల వ్యవహారంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. వారిని పిలిపించి మాట్లాడుతోంది. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేస్తోంది. మరోవైపు.. కొందరు ప్రజాప్రతినిధులను బుజ్జగించే బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది.













