‘విపక్ష’ పాత్రలో బీఆర్ఎస్..
దశాబ్దకాలం పాటు తెలంగాణను ఎదురులేకుండా పాలించిన బీఆర్ఎస్.. ఇక నుంచి విపక్ష పాత్ర పోషించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం తీవ్రరూపు దాల్చిన సమయంలో… ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చింది గులాబీ పార్టీ. తెలంగాణ ప్రాంతం సమస్యలపై చీల్చి చెండాడింది. ఇప్పుడు విపక్షమే.. కానీ ఏరికోరి తెచ్చుకున్న రాష్ట్రంలో విపక్ష బాధ్యత పోషించాల్సి ఉంది. కాబట్టి ఆపార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు…రెండుసార్లు మనల్ని గెలిపించిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పాలించే అవకాశమిచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆర్నెల్ల సమయమిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం. ప్రజల తీర్పును గౌరవించి హుందాగా వైదొలిగామని.. త్వరలోనే పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయని పక్షంలో అప్పుడు నిలదీద్దామని, అప్పటి వరకూ వేచి చూద్దామని ఆయన చెప్పినట్లు సమాచారం.
మాజీ మంత్రులు, ఎన్నికల్లో గెలిచిన వారితోపాటు ఓడిన అభ్యర్థులు, పార్టీ నేతలతో సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోగా.. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన ఎమ్మెల్యేలను ఓదార్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ, నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లానింగ్ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.
అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన తాము.. ఇకపై పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉందామని కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాం. అయినా ప్రజలు మరో పార్టీకి అవకాశమిచ్చారు. మనకూ గౌరవప్రదమైన స్థానాలిచ్చారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దాం. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని అనుకోలేదని పేర్కొంటూ.. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందల సంఖ్యలో మెసేజ్లు వస్తున్నాయన్నారు కేటీఆర్.
మరోవైపు…పలుగ్యారెంటీలు, హామీలతో ప్రజల ముందుకు వెళ్లి, వారిమనసు గెల్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలో రావడంతో హామీల అమలుపై దృష్టి సారించింది. ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తర్వాత హామీలను అమలు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి గానూ కసరత్తు కొనసాగుతోంది. ప్రజలకు కాంగ్రెస్ నేతలు భారీగానే హామీలిచ్చి ఉండడంతో.. వాటి అమలుపై ప్రజల నుంచి కూడా చాలా ఆశలున్నాయి.













