విపక్షాల దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో..! అక్టోబర్ 16న విడుదల..!!
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 2014, 2018 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన ఆ పార్టీ ఇప్పుడు మూడోసారి గెలిచి సత్తా చాటాలనుకుంటోంది. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు అది వర్కవుట్ కాదనే అంచనాలున్నాయి. ప్రభుత్వ పనితీరును ప్రాతిపదికగా చేసుకుని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు కేసీఆర్. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ప్రజాకర్షక పథకాలతో ముందుకొస్తున్నాయి. వాటికి చెక్ చెప్పాలంటే అంతకు మించిన పథకాలతో మేనిఫెస్టో ఉండాలనుకుంటున్నారు కేసీఆర్. అందుకోసం ఆయన రెడీ అవుతున్నట్టు సమాచారం.
నీళ్లు, నిధులు, నియామకాలు .. ఇదే తెలంగాణ డిమాండ్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. ఈ మూడింటిలోనూ స్వావలంబన సాధించామని బీఆర్ఎస్ చెప్తోంది. తమ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశంలోనే మోడల్ గా తయారైందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. గత రెండు దఫాలుగా తాము హామీ ఇవ్వని వాటిని కూడా అమలు చేసి చూపించామంటున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వస్తే తెలంగాణ స్వరూపమే మారిపోయేలా అభివృద్ధి చేసి చూపిస్తామని భరోసా ఇస్తున్నారు. ప్రపంచ పటంలోనే తెలంగాణ ఉండేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వెల్లడిస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ను ఓడించాలంటే ప్రజాకర్షక పథకాలు ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కర్నాటకలో సక్సెస్ అయిన 5 గ్యారంటీ స్కీములకు మరొకదాన్ని యాడ్ చేసి 6 గ్యారంటీ స్కీములు ప్రకటించింది. వీటికి మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ స్కీములపై కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారు. వాటికి వస్తున్న స్పందనను బట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన వాటిలో కొన్ని ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నాయి. అయితే వాటిని మరికొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది.
అయితే విపక్షాలకు ఏమాత్రం అందని రీతిలో ఈసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ వర్తించేలా వైద్య బీమా అమలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ స్థానంలో రూ.10లక్షల విలువ చేసే ఉచిత వైద్య బీమాను అందరికీ వర్తించేలా ప్రత్యేక పథకాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే రైతుబంధు ద్వారా ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు. దీన్ని రూ.12 వేల నుంచి రూ.15వేల వరకూ పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అంతేకాక రైతులకు కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వితంతు, ఆసరా పెన్షన్ల మొత్తాన్ని 4వేలకు పెంచబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలో సగాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా కొత్త స్కీమ్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇక గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అమలు చేయలేకపోయిన నిరుద్యోగ భృతిని ఈసారి అమలు చేయాలనుకుంటున్నారు కేసీఆర్. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ స్కీమ్ ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ రెండో వారంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే అక్టోబర్ 16న వరంగల్ లో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఆ సభలోనే కీసీఆర్ మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు.













