బీజేపీ రామనామం..! టీఆర్ఎస్ హనుమాన్ అస్త్రం..!!
బీజేపీ హిందుత్వను ప్రమోట్ చేయడంలో ముందుంటుంది. ఇవాళ బీజేపీ అధికారంలో ఉందంటే అందుకు కారణం కూడా హిందూవాదమే. హిందుమత పరిరక్షణే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుంటుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణంకోసం బీజేపీ ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు సాకారమవుతోంది. ఇప్పటికే రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా పూర్తయింది. మరో రెండేళ్లలో అది పూర్తి కానుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి.
తెలంగాణలో కూడా రామాలయం కోసం బీజేపీ అధిక సంఖ్యలో విరాళాలు సేకరించింది. దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాల్లో తెలంగాణే ఫస్ట్ ప్లేస్ లో ఉందంటే ఇక్కడి శ్రేణులు ఏ స్థాయిలో పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా ఉత్తరాదిలో లాగా హిందుత్వ నినాదాన్ని తెరపైకి తేవడం ద్వారా సక్సెస్ అవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కాస్త సక్సెస్ అయిందని భావించవచ్చు. దుబ్బాకలో కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ బీజేపీ విజయం సాధించగలిగిందంటే హిందుత్వ నినాదం కూడా ఓ కారణం. బీజేపీ శ్రేణులు పూర్తిగా రామనామాన్ని జపిస్తూ ముందుకెళ్తున్నాయి.
తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. బీజేపీ రామనామానికి ధీటుగా హనుమాన్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వేదికగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ యజ్ఞాన్ని ముందుండి నడిపిస్తున్నారు. 82 రోజులపాటు సాగే ఈ యజ్ఞంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్రేణులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
జూన్ 4 వరకు జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని బుధవారం ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. మొదటి రోజు పారాయణం అద్భుతంగా జరిగిందని.. ఇదే ఉత్సాహంతో చివరి రోజూ వరకూ పఠించాలని ఆమె పిలుపునిచ్చారు. జూన్ 4 వరకూ ప్రతిరోజూ ఐదున్నర నుంచి అరు గంటల మధ్య అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాని ఆమె సూచించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించినట్లు కవిత చెప్పారు. హనుమంతుడికి ఇష్టమైన రామకోటిని 11 కోట్ల మేర రాసి పెద్ద జయంతి నాటికి నివేదించాలని సంకల్పించినట్లు చెప్పారు. రామకోటి రాసే వాళ్ళు 80 రోజుల్లో వీలైనంత రాసి నివేదించాలని కోరారు.
ముల్లును ముల్లుతోనే తీయాలనేది సామెత. అందుకే బీజేపీ హిందుత్వ నినాదానికి అదే సరైన నినాదమని టీఆర్ఎస్ భావించినట్లు అర్థమవుతోంది. అందుకే హనుమాన్ అస్త్రాన్ని సంధించినట్లు తెలుస్తోంది. మరి ఈ అస్త్రం టీఆర్ఎస్ కు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూద్దాం.













