మౌలిక సదుపాయాలు లేకపోతే.. క్రీడాకారులు ఎలా?
మౌలిక సదుపాయాలు లేకపోతే మంచి క్రీడాకారులు ఎలా తయారవుతారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లయినా ఇంత వరకు రాష్ట్రానికి క్రీడా పాలసీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. గచ్చిబౌలి స్టేడియాన్ని టిమ్స్‌కు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కరెంటు బిల్లు కట్టకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఐదేళ్ల నుంచి కోచ్‌లకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చే ముందు ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించాలని కోరారు. క్రీడా పాలసీ, స్టేడియాల్లో మౌలిక సదుపాయాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.













