మోదీ దిష్టి బొమ్మలు కాదు.. కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలి
హుజూరాబాద్ దెబ్బతో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేయటం, చావు డప్పులు కొట్టడం దుర్మార్గమన్నారు. చావు డప్పు కొట్టాల్సి వస్తే మొదట ప్రగతి భవన్ ముందు కొట్టి, కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలన్నారు. మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వనుందుకు కేసీఆర్ దిష్టిబొమ్మ తగులబెట్టాలన్నారు. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మాట తప్పినందుకు కేసీఆర్‌కి చావు డప్పు కొట్టాలని తెలిపారు.
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం దాడులు చేయమంటున్నారని మండిపడ్డారు. తన తప్పులు కప్పిపుచ్చుకొనేందుకే సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులను, రైతులను సీఎం మోసం చేశారన్నారు. ప్రగతిభవన్‌లో ఇనుప కంచె వేసి లోపలికి ఎవరినీ రానివ్వరని ఆక్షేపించారు. సంబంధింత శాఖల మంత్రులు లేకుండానే సీఎం సమీక్షలు జరపడం ఏంటని ప్రశ్నించారు.













