అభ్యర్థుల వేటలో బీజేపీ బిజీబిజీ..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసేసి కదనరంగంలోకి దూకేసింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వడపోతలో బిజీగా ఉంది. ఈ ప్రక్రియలో బీజేపీ వెనుకబడింది. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించిన బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడుతోంది. ఇవాల్టి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అనంతరం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలోనే జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయించి అనౌన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో మాత్రం సరికొత్త ప్రక్రియ చేపడుతోంది బీజేపీ. పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాల్టి నుంచి పదో తేదీ వరకూ ఈ దరఖాస్తులను స్వీకరించనుంది. అప్లికేషన్లకు ఎలాంటి రుసుమూ వసూలు చేయకపోవడంతో పెద్దఎత్తున ఆశావహులు ముందుకొస్తారని పార్టీ భావిస్తోంది. పదో తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత వాటిని వడపోయనుంది.
కాంగ్రెస్ పార్టీ తరహాలోనే బీజేపీ కూడా దరఖాస్తులను వడపోసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురిని ఎంపిక చేసి హైకమాండ్ కు పంపుతుంది. వారిలో మెరుగైన అభ్యర్థిని ఎంపిక చేసి పార్టీ ప్రకటిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అప్లికేషన్ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుండడం పార్టీలో ఒకింత చర్చనీయాంశంగా మారింది. నేతలు ఎవరెవరు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటారో అని ఆరా తీయడం మొదలు పెట్టారు. అంతేకాక.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని వాళ్లు కూడా బీజేపీ టికెట్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే సీనియర్ నేతలు ఎక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నా కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిన మేరకే వాళ్లు పోటీ చేయాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచించింది. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వారిపై బలమైన నేతలనే బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. గజ్వేల్ లో కేసీఆర్ పైన ఈటల రాజేందర్, కామారెడ్డిలో విజయశాంతి, సిద్ధిపేటలో హరీశ్ రావుపైన రఘునందన్ రావు, సిరిసిలలో కేటీఆర్ పైన బండి సంజయ్.. పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఎవరైనా పార్టీ నిర్ణయించిన స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా అప్లికేషన్ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం కొన్ని విమర్శలకు దారితీస్తోంది. అన్ని స్థానాల్లో పార్టీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే అప్లికేషన్లు ఆఫర్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.













