కమలం ఫోకస్….
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి దూసుకెళ్తుండడంతో… రేసులో వెనకబడకూడదని భావిస్తున్న బీజేపీ హైకమాండ్.. పార్టీ బలోపేతంగా దృష్టి సారించింది. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు క్యూ కడుతుండడంతో.. ప్రత్యామ్నాయ వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటికీ బీజేపీ కార్యకర్తలు వెళ్లి… మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలను ప్రచారం చేయనున్నారు. దీనికోసం 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను.. రాష్ట్రానికి రప్పిస్తోంది.
ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించారు. ఇంతటితో సరిపోతుందా? అంటే ఏమాత్రం కుదరదు. పార్టీ నేతలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన పథకాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా తెలంగాణ బీసీ ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. దీనిని క్యాష్ చేసుకునేందుకు ‘బీసీ గర్జన’ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇప్పటికే.. మే నెలలో ఓబీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇకపై మరింత ఫోకస్ చేయనుంది. అలాగే.. బీజేపీ మహాజన్ సంపర్క అభియాన్లో భాగంగా గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
గడగడపకు బీజేపీలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలకు వివరించే యత్నం చేస్తోంది. దీనికోసం హైదరాబాద్ వేదికగా.. జూలై 8న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత కార్యదర్శులతో కీలక సమావేశాన్ని బీజేపీ నిర్వహించనుంది. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను తెలంగాణకు పార్టీ రప్పించనుంది. వీరితో పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను బీజేపీ చేపట్టనుంది. వీరంతా బృందాలుగా విడిపోయి మరీ పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నారు. ‘మేరా పోలింగ్ బూత్.. సబ్సే మజ్బూత్’ కార్యక్రమం ద్వారా బూత్ స్థాయిలో బీజేపీని ఈ సభ్యులు బలోపేతం చేయనున్నారు.
మరోవైపు ఇదే సందర్భంలో ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకునేదిశగానూ .. వీరు ప్రయత్నాలు చేస్తారు.క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు కలిగిన నాయకులు, కార్యకర్తలను.. పార్టీలోకి ఆహ్వనించడమే కాకుండా… కార్యక్రమాలకు హాజరుకాకుండా స్తబ్దుగా ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు… సందర్భాన్ని బట్టి స్పందిస్తున్నారు. అగ్రనేతలు వచ్చినప్పుడు హడావుడి చేసి, ఆపై కామ్ గా ఉంటున్నారు. వీరిని సైతం క్రియాశీలకం చేస్తే పార్టీకి మేలు చేకూరుతుందని కార్యకర్తలు చెబుతున్నారు.













