దేత్తడి హారిక చుట్టూ వివాదం.. ముగిసినట్లేనా..?
దేత్తడి హారిక.. లేదంటే బిగ్ బాస్ హారిక.. ఈ పేరు తెలియనివాళ్లు ఉండరేమో. బిగ్ బాస్ లోకి వెళ్లక ముందే దేత్తడి హారికగా ఈ అమ్మాయి సూపర్ పాపులర్. సోషల్ మీడియాలో పేరొందిన సెలబ్రిటీ. తన ప్రోగ్రామ్స్ తోనే పాపులారిటీ సంపాదించుకున్న హారిక బిగ్ బాస్ కు వెళ్లింది. ఆ షోలో ఫైనల్స్ వరకూ వెళ్లి అలరించింది. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది. ఎప్పటిలాగే ఆమెను సోషల్ మీడియన్స్ బాగా ఆదరిస్తున్నారు.
తాజాగా దేత్తడి హారిక తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ప్రపంచ మహిళా దినోత్సవం వేళ ఆమె.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా .. హారికకు ఒప్పంద నియామక పత్రాలను కూడా అందించారు. అయితే ఈ నియామకంపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోలింగ్ నడిచింది. ఒకే కులానికి చెందిన వాళ్లు కావడంతోనే శ్రీనివాస గుప్తా.. హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ట్రోల్స్ ఓ వైపు నడుస్తుండగానే.. మరోవైపు శ్రీనివాస గుప్తా తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ ను కానీ.. సీఎంఓ కార్యాలయాన్ని కానీ సంప్రదించకుండానే హారికను నియమించుకున్నారని తేలింది. దీంతో మంత్రి నేరుగా ఉప్పల శ్రీనివాసగుప్తాను వివరణ కోరినట్లు సమాచారం. మరోవైపు సీఎంఓ కార్యాలయం కూడా శ్రీనివాస గుప్తా వివరణ కోరినట్లు తెలుస్తోంది. దీంతో హారికను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
వివాదాలు చుట్టుముడుతండడంతో పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా.. ఆ సంస్థ ఎండీ మనోహర్ తో కలిసి మీడియా ముందుకొచ్చారు. కరోనా సంక్షోభంలో పర్యాటకరంగం దారుణంగా దెబ్బతినిందని.. అందుకే దాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు హారికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వివరణ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ప్రచారం చేసేందుకే తెలంగాణ బిడ్డ, సోషల్ మీడియాలో పాపులర్ అయిన హారికను నియమించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో అవసరమైనప్పుడు మాత్రమే ఆమె సేవలు వినియోగించుకుంటామని వివరించారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని భావిస్తున్నారు.













