తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు కీలక పదవి వరించింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ నియమితులైయ్యారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా బండి సంజయ్‌ను నియమించినట్లు ఆపార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటనలో పేర్కొన్నారు. సంజయ్ నియామకం తక్షణమే అమల్లోకి రానుందని పేర్కొంది. కాగా కేవలం ఒక్కసారిగా ఎంపీగా గెలుపొందగానే రాష్ట్ర చీఫ్‌గా అవకాశం రావడం వివేషం. గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో సంజయ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన సంజయ్.. ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్‌పై సంచలన విజయం సాధించారు. అలాగే ప్రస్తుతమున్న బీజేపీ నేతల్లో కరుడుగట్టిన హిందుత్వ వాదిగా కూడా సంజయ్ గుర్తింపు పొందారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో పాటు అనేక ఇతర సమీకరణాలు కలిసిరావడంతో అధ్యక్ష పదవి వరించింది.













