తెలంగాణ బీజేపీలో అమిత్ షా చిచ్చు రాజేశారా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తెలంగాణలో ఈసారి తమదే అధికారమని, కేసీఆర్ ను గద్దె దించబోతున్నామని మొదటి నుంచి చెప్తూ వస్తోంది బీజేపీ. కమలం పార్టీ దూకుడు చూసిన జనం.. నిజంగానే ఆ పార్టీ కేసీఆర్ ను ఇంటికి పంపుతుందని నమ్ముతూ వచ్చారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. రేసులో కాంగ్రెస్ కంటే వెనుకబడింది. కేసీఆర్ పైన కూడా దూకుడు తగ్గించింది. ఎన్నికలు సమీపిస్తున్న కీలక సమయంలో ఇలా వెనుకబడిపోవడం బీజేపీలోని కొందరు నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. హోంమంత్రి అమిత్ షా తన పర్యటనలో పార్టీని గాడిలో పెడ్తారని భావించిన నేతలకు ఆశాభంగమే మిగిలింది.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో అధికారికంగా నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశం కోసం ఒక రోజు ముందే హైదరాబాద్ చేరుకున్నారు అమిత్ షా. దీంతో పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు, ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేదుకు అమిత్ షా సమయం కేటాయిస్తారని అందరూ భావించారు. అయితే 16న సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ముఖ్య నేతలందరూ ఘనస్వాగతం పలికారు. అనంతరం హోటల్ కు వెళ్లారు అమిత్ షా.
హోటల్లో మొదట మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో అమిత్ షా ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. అనంతరం కిషన్ రెడ్డితో అమిత్ షా మంతనాలు సాగించారు. మిగిలిన నేతలెవరినీ కలుసుకోలేదు. ఇక మరుసటిరోజు విమోచన దినోత్సవ సభ ముందో, ఆ తర్వాతో కోర్ కమిటీతో అమిత్ షా భేటీ అవుతారని అందరూ అనుకున్నారు. నాలుగున్నర గంటలపాటు అమిత్ షాకు రిజర్వ్ టైమ్ కేటాయించడంతో తప్పకుండా పార్టీకోసం దృష్టి పెడ్తారని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. దీంతో కీలక నేతలందరూ తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు.
అమిత్ షా పర్యటనలో తమను పట్టించుకోలేదని భావించిన పలువురు కీలక నేతలు రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాడా సురేశ్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్, రవీంద్ర నాయక్ తదితరులు రహస్యంగా భేటీ అయి పార్టీలో పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ కు పార్టీ హైకమాండ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండడాన్ని వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాక.. అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కోర్ కమిటీని హాజరు పర్చకపోవడంపై కూడా గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లోనే తేల్చుకోవాలని వీళ్లంతా భావిస్తున్నట్టు సమాచారం. మరి ఈ పరిణామాలను కిషన్ రెడ్డి ఎలా చక్కబెడతారనేది వేచి చూడాలి.













