తెలంగాణ బీజేపీకి త్వరలో గట్టి షాక్!
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలంతా సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. ఏ పార్టీలో తమకు టికెట్ దక్కుతుంది.. ఎక్కడ గెలిచే అవకాశం ఉంది.. ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలున్నాయి.. లాంటి అనేక అంశాలను నేతలు బేరీజు వేసుకుంటున్నారు. తొందరపడకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో త్వరలోనే బీజేపీకి గట్టి షాక్ తగులుతుందని భావిస్తున్నారు. ఒకరిద్దరు కాకుండా చాలా మంది నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ బ్రహ్మ పదార్థం. కొత్తగా వెళ్లిన నేతలకు అక్కడ ఇమడడం చాలా కష్టం. పార్టీ సిద్ధాంతాలను ఒంట బట్టించుకోవడం ఆషామాషీ కాదు. దీనికి తోడు ముందు నుంచి ఉన్న నేతల పెత్తనం మామూలుగా ఉండదు. కొత్తగా వెళ్లిన నేతలకు కనీస మర్యాద కూడా ఇవ్వరనే పేరుంది. పైగా కొత్తగా వచ్చిన వాళ్లు తమను దాటి ఎక్కడ ముందుకు వెళ్లిపోతారోననే భయంతో ఎప్పటికప్పుడు వెనకాల గోతులు తవ్వుతుంటారు. దీంతో కొత్త వాళ్లకు ఏం చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితి. ఇప్పుడు బీజేపీలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని భావించి తండోపతండాలుగా తరలివచ్చిన నేతలంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్లారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి.. లాంటి నేతలెందరో కమలం కండువా కప్పుకున్నారు. పార్టీలో మొదట్లో వీళ్లుకు మంచి ప్రాధాన్యత లభించింది. ఇప్పటికీ రాష్ట్రనేతలు వీళ్లను పెద్దగా పట్టించుకోకపోయినా హైకమాండ్ మాత్రం వీళ్ల పట్ల సానుకూలంగానే ఉంది. దీంతో కష్టమో నష్టమో భరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి రివర్స్ అయింది. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ ఆశలు అడుగంటిపోయాయి. అందరి చూపూ కాంగ్రెస్ వైపు ఉంది. దీంతో బీజేపీలోకి వెళ్లిన నేతలంతా సందిగ్ధంలో పడ్డారు.
బీజేపీలోకి వలస వెళ్లిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో వీళ్లంతా రహస్యంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఇలాంటి అసంతృప్తి నేతలు దాదాపు 10-15 మంది ఉండొచ్చని అంచనా. వీళ్లంతా బలమైన లీడర్లే. ఆర్థికంగా, సామాజికంగా మంచి పట్టున్న నేతలే. ఇలాంటి వాళ్లు పార్టీని వీడితే బీజేపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయం. ఇప్పటికే బీజేపీకి క్షేత్రస్థాయిలో పట్టు లేక సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో బలమైన నేతలను కోల్పోతే మరింత దిగజారడం ఖాయం.













