తెలంగాణ బీజేపీలో తారస్థాయికి ఆధిపత్య పోరు.,.!
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది బీజేపీ. అంతేకాదు.. ఈసారి తమదే అధికారమని ఎంతో నమ్మకంతో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా ఉన్నాయా అనేది డౌటే. అంతేకాదు.. రాష్ట్రస్థాయి లీడర్ల మధ్య సఖ్యత కూడా ప్రశ్నార్థకంగానే మారింది. టాప్ లెవల్ లీడర్ల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీని భుజాలనెత్తుకుని అధికారం వరకూ తీసుకెళ్లగలుగుతారా అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. బండి సంజయ్ పర్ఫార్మెన్స్ తో హైకమాండ్ కూడా ఎంతో పాజిటివ్ గా ఉంది. దీంతో ఆయన పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. వాస్తవానికి బండి సంజయ్ పదవీకాలం పూర్తయింది. అయినా ఎన్నికల వరకూ బండి సంజయ్ ని మార్చే ప్రసక్తే లేదని ఇటీవల హైకమాండ్ సంకేతాలిచ్చింది. దీంతో తనకు తిరుగులేదనుకుంటున్నారు బండి సంజయ్. అంతేకాక.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని ఆయన బావిస్తున్నారు.
అయితే బండి సంజయ్ తీరుపై మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ అసంతృప్తితో ఉన్నారు. కవితను విమర్శించడంలో అర్వింద్ ముందుంటారు. కేసీఆర్ కుటుంబంపై ఉవ్వెత్తున ఎగసి పడుతుంటారు. అలాంటిది కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను అర్వింద్ ఖండించారు. బండి సంజయ్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందని సూచించారు. అంతేకాక.. బండి సంజయ్ ను మార్చి మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్ల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.
బండి సంజయ్, అర్వింద్ మధ్యే కాదు.. మగిలిన లీడర్ల మధ్య కూడా గ్యాప్ ఉంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి.. తదితరులు కూడా వివిధ లెక్కలేసుకుని సీఎం పీఠంపై కన్నేశారు. దీంతో ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. దీంతో పార్టీ అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు.. కనీసం గట్టి ఫైట్ ఇస్తుందా.. అని పార్టీలోనే కొందరు గుసగుసలాడుకుంటున్నారు.













