తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్..! కాంగ్రెస్ రాత మారుతుందా..?
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అయినా ఆ పార్టీ అధికారంలోకి రావడం లేదు. ప్రజల్లో అభిమానం ఉన్నా.. దాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో హస్తం పార్టీ ఫెయిల్ అవుతోంది. ఇప్పటికే రెండు చాన్స్ లు మిస్ అయిన కాంగ్రెస్ పార్టీ … ఈసారి అవకాశాన్ని కోల్పోకూడదని బావిస్తోంది. అందుకే ప్రియాంక గాంధీని నమ్ముకుంది. ఆమె ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకుంటోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి కేడర్ ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలున్నారు. దశాబ్దాలుగా ఆ పార్టీని అభిమానించే ప్రజలున్నారు. కానీ లీడర్ల మధ్య సయోధ్య లేకపోవడంతో ఆ పార్టీ అనేక ఇబ్బందులు పడుతోంది. ఉమ్మడిగా ఉన్నంతవరకూ ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలదే అధికారం. విడిపోయాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సోనియా గాంధీ సాకారం చేశారు కాబట్టి. కానీ అలా జరగలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండోసారీ విజయం సాంధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ ఇచ్చినా ఎందుకు అధికారం దక్కించుకోలేకపోతున్నామని కాంగ్రెస్ హైకమాండ్ అడుగుతున్నా ఇక్కడి నేతల్లో సీరియస్ నెస్ లేదు.
ఇంతకాలం రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ నేతలు పనిచేశారు. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు, ఎలా చెప్పి చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. వరంగల్ లో రైతు సభ పెట్టారు. అప్పడు నేతలంతా కలసికట్టుగా పని చేయాలని రాహుల్ సూచించారు. ఆ తర్వాత భారత్ జోడో యాత్ర సమయంలో నేతల తీరు మారకపోతే కష్టమని హెచ్చరించారు. అయినా నో యూజ్. ఇప్పటికీ నేతలు ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలను పట్టించుకోకుకండా స్వప్రయోజనాలకోసం పాకులాడుతున్నారు. దీంతో పార్టీ మంటగలిసిపోతోంది. ఇలాగైతే కష్టమని బావించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతోంది.
ఈ నెల 8న ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ లో జరిగే నిరుద్యోగ సభలో పాల్గొంటున్నారు. యూత్ పాలసీని ఆ రోజు ఆవిష్కరించాలని టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. అయితే పార్టీని గాడిలో పెట్టాలంటే తెలంగాణ నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయించాలనే ఆలోచన కూడా కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అప్పుడే నేతలంతా ఒక్కతాటి పైకి వచ్చే అవకాశం ఉంటుందని, లేకుంటే పార్టీ చిలువలుపలువలు కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కర్నాటక ఎన్నికలు ముగియడంతో ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోనే ఎక్కువకాలం మకాం వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ప్రియాంక రాకతో అయినా తెలంగాణ కాంగ్రెస్ పనితీరు మారుతుందేమో..!













