తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్..! మల్కాజిగిరి నుంచి ప్రియాంక గాంధీ పోటీ..!?
కర్నాటక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రస్తుతం జాతీయ పార్టీల దృష్టంతా తెలంగాణపైనే ఉంది. ఈ ఏడాది చివర్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే ఇందుకు కారణం. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్తున్నాయి. బీజేపీ అయితే కర్నాటకతో పాటు తెలంగాణ కూడా గెలవబోతున్నామని ధీమాగా ఉంది. అందుకే పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న ఆ రెండు పార్టీలు ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టాయి. అయితే కర్నాటకలో సర్వేలన్నీ తమవైపే మొగ్గు చూపుతుండడంతో ఇక దృష్టంగా తెలంగాణపై పెట్టి విజయం సాధించాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.
కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ఆ పార్టీ మరింత ఉత్సాహంగా పని చేసేందుకు అవకాశం కలుగుతుంది. కర్నాటకలో క్లీన్ మెజారిటీ లభించబోతోందని సర్వేలన్నీ చెప్తున్నాయి. దీంతో ఇదే ట్రెండ్ ను తెలంగాణలో కంటిన్యూ చేయాలనుకుంటోంది కాంగ్రెస్. అందుకే మరో ఆరు నెలల పాటు తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనుకుంటోంది. ముఖ్యంగా ప్రియంక గాంధీ సేవలను ఇక్కడ ఎక్కువగా వాడుకోవాలనుకుంటోంది. యూత్ డిక్లరేషన్ విడుదల సందర్భంగా ప్రియాంక గాంధీ సభకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆమెను ముందు పెట్టి ఇదే స్పీడ్ కంటిన్యూ చేయాలనుకుంటోంది.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా రెండు సార్లు బోల్తా పడింది. ఇప్పుడైనా విజయం సాధించాలనుకుంటోంది కాంగ్రెస్. తాము తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ఎక్కడుండేవారు.. అని ప్రియాంక ప్రశ్నించింది. తెలంగాణ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని జాగీర్ లాగా కేసీఆర్ మార్చుకున్నారని విమర్శించింది. కేసీఆర్ పై ప్రింయాక స్పీచ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పరిస్థితిపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకుంటున్నట్టు సమాచారం. ప్రియాంక టీమ్ తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రియాంక గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేలా టీపీసీసీ ప్లాన్ వేస్తోంది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాక దక్షిణ భారతదేశవ్యాప్తంగా పార్టీకి మంచి జోష్ వస్తుందని భావిస్తున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి ప్రియాంకను పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే హైకమాండ్ నుంచి ఇంకా సానుకూల స్పందన రాలేదు. ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు రాహుల్ గాంధీ. అయితే ఆయన ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. మరి ఆమె నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.













