మునుగోడు బైపోల్‌కు కౌంట్‌డౌన్ షురూ..! మూడు పార్టీల్లోనూ టెన్షన్ టెన్షన్..!!
మునుగోడు పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికాసేపట్లో ప్రచారానికి తెరపడుతోంది. సుమారు రెండు నెలలుగా మునుగోడులో ఎక్కడ చూసినా నేతలే కనిపించారు. నోట్లు కుమ్మరించారు. నీళ్లప్రాయంలా ఖర్చు పెట్టారు. మద్యంతో జనమంతా ఊగేలా చేశారు. అయినా పార్టీలకు లోలోపల ఏదో టెన్షన్..! మనం డబ్బులిచ్చిన వాళ్లంతా మనకు ఓట్లేస్తారా.. అనే ఆందోళన. ఇది ఏ ఒక్క పార్టీదో కాదు.. అన్ని పార్టీలకూ ఇదే టెన్షన్ పట్టుకుంది. ఒక్కో పార్టీ సుమారు వంద కోట్లు ఖర్చు పెట్టిందని అంచనా. రెండు ప్రధాన పార్టీలు వంద కోట్లకు మించే ఖర్చు చేశాయని చెప్తున్నారు స్థానికులు. అయినా ఎందుకు పార్టీలు భయపడుతున్నాయి.?
మునుగోడు ఎన్నిక గురువారం జరగనుంది. ఇవాల్టితో ప్రచారం ముగుస్తోంది. ఎత్తులు పైఎత్తులతో మునుగోడు మహాయుద్ధాన్ని తలపించింది. నియోజకవర్గంలో ఎటు చూసినా నేతలే దర్శనమిచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం 80 మందికి పైగా ప్రజాప్రతినిధులందరినీ మునుగోడులో మోహరించింది. గ్రామాలవారీగా విభజించుకుని నేతలు ప్రతి ఇంటి గడపా తొక్కారు. తాము చేసిన అభివృద్ధి పనులను ఓటరు దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఇంటికి ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత సాయం చేసిందో లెక్కగట్టి మరీ తెలియజేసింది. దళితబంధు, చేనేతబంధు లాంటి స్కీముల ద్వారా లబ్ది పొందిన వాళ్లను ప్రత్యేకంగా కలిసి చేసిన మేలు చెప్పుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వప్రయోజనాలకోసం తెలంగాణను ఫణంగా పెట్టారని ఆరోపించింది. 18వేల కాంట్రాక్టులు దక్కించుకుని ఈ ఉపఎన్నికను తీసుకొచ్చారని విమర్శించింది. ఓవైపు అధికారబలం, మరోవైపు ఆర్థికబలం టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్స్. లెఫ్ట్ పార్టీలు మద్దతు పలకడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అంశం. కారును పోలిన గుర్తులు టీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి.
ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ పూర్తిగా రాజగోపాల్ రెడ్డిపైనే ఆధారపడింది. స్థానికంగా కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉండడం., ఎన్నికల మేనేజ్ మెంట్ లో దిట్టగా పేరొందడం వారికి కలిసొచ్చే అంశం. గ్రామగ్రామానా రాజగోపాల్ రెడ్డికి అనుచరగణం ఉంది. పైగా ఆర్థికంగా ఎందాకైనా వెళ్లే దమ్ముంది. మరోవైపు బీజేపీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో తమ విజయం ఖాయమని బీజేపీ బలంగా నమ్ముతోంది. అయితే.. కాంట్రాక్టులకోసమే రాజగోపాల్ రెడ్డి ఈ ఉపఎన్నిక వచ్చిందన్న ప్రచారం బీజేపీకి మైనస్ గా మారింది. అంతేకాక.. రాజగోపాల్ రెడ్డి అనుచరులకు, బీజేపీ కేడర్ కు మధ్య సమన్వయం కూడా కొరవడింది. ముందు నుంచి ఉన్న తమను బీజేపీ నేతలు పట్టించుకోలేదనే బాధ కమలం నేతలకు ఉంది. మరోవైపు మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకోలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో రాజగోపాల్ రెడ్డి దిట్ట. మరి చూడాలి ఏం జరుగుతుందో!
ఇక కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం. అందుకే ఎలాగైనా మళ్లీ చేజిక్కించుకోవాలనే పట్టుదల ఆ పార్టీ నేతల్లో ఉంది. స్థానికంగా మంచి పట్టున్న పాల్వాయి కుటుంబానికి చెందిన స్రవంతిని బరిలోకి దింపింది హస్తం పార్టీ. నియోజకవర్గంలో పలువురు నేతలు పాల్వాయి అనుచరులుగా ఉన్నాయి. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులోనే మకాం వేసి ప్రచారం సాగిస్తుండడం.. పార్టీని కాపాడుకుందాం అనే సెంటిమెంట్ రాజేస్తుండడం స్థానికుల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. అంతేకాక.. ఆడబిడ్డ అనే సెంటిమెంట్ ను బలంగా ప్రయోగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుంచి ఆశించినంత సహకారం ఇక్కడ కనిపించట్లేదు. కోమటిరెడ్డితో కాంగ్రెస్ కేడర్ అంతా వెళ్లిపోవడం, కేడర్ ను కాపాడుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఆర్థికంగా కూడా టీఆర్ఎస్, బీజేపీలతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటివరకూ హుజూరాబాద్ మాత్రమే దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికగా భావించారు. అక్కడ సుమారు వంద కోట్లు ఖర్చయిందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు మునుగోడులో పార్టీల ఖర్చు 3వందల కోట్లు దాటిపోయిందని లెక్కగడుతున్నారు. అందుకే మునుగోడు బైపోల్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే నెలకొంది. తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి లాంటి పార్టీలు కూడా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ భయం పట్టుకుంది. కాంగ్రెస్ చీల్చే ఓట్లు తమ గెలుపుపై ప్రభావం చూపిస్తాయని భయపడుతున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













