తెలంగాణలో ప్రధాని మోదీ టూర్..! టీఆర్ఎస్ – బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం..!!
టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి ఏడాదిపాటు రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండేది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్ ఆ రెండు పార్టీల మధ్య దూరం పెంచాయి. మునుగోడు ఉపఎన్నికతో ఆ రెండు పార్టీలు మరోసారి హోరాహోరీ తలపడ్డాయి. ఇదే సమయంలో బయటికొచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. 12వ తేదీ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై కారాలు మిరియాలూ నూరుతున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పి రావాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రచ్చకు కారణమవుతోంది. రామగుండంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాయి. ఇందులో కేంద్రం వాటా 89 శాతం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ వాట్ 11 శాతంగా ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో కేంద్రం కనీసం ప్రోటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారు అయినప్పుడు ప్రారంభోత్సవంలో తమకూ తగిన ప్రాతినిథ్యం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై ఏడాది అయిందని.. ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించడమేంటని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవచ్చని సమాచారం అందుతోంది. గతంలో కూడా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించినప్పుడు కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని అధికార టీఆర్ఎస్ తో పాటు వామపక్షాలు హెచ్చరించాయి. తెలంగాణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. జీఎస్టీ నుంచి విభజన హామీల వరకూ.. అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండి పడుతున్నారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్నదానికంటే.. తెలంగాణ దేశానికి ఇస్తున్నదే ఎక్కువగా ఉందని మంత్రులు చెప్తున్నారు. తెలంగాణలో పర్యటించే ముందు వీటికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, విభజనచట్టంలోని అంశాలను ఇప్పటివరకూ పరిష్కరించకపోవడంపై బీజేపీ, మోదీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఫామ్ హౌజ్ డీల్స్ వ్యవహారంపైనా కూడా టీఆర్ఎస్ బీజీపీని కార్నర్ చేస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్ర లేకపోతే.. ఆ పార్టీ కోర్టును ఎందుకు ఆశ్రయించిందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో లాగే తెలంగాణలో కూడా కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరలేపిందని ఆరోపిస్తున్నారు. వీటన్నిటికీ ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి సమాధానం చెప్పకపోతే ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ తో పాటు వామపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి.
అయితే బీజేపీ మాత్రం టీఆర్ఎస్ కు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదంటోంది. మోదీ పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూస్తామని చెప్తోంది. ప్రధాని మోదీ టూర్ గుర్తుండిపోయేలాగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొత్తానికి తెలంగాణలో మోదీ టూర్ మరోసారి టీఆర్ఎస్, బీజేపీ మధ్య రచ్చ రాజేస్తోంది.













