ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో ట్విస్ట్..! సుప్రీంకోర్టులో ఫామ్ హౌజ్ నిందితుల పిటిషన్..!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి రెండు ఆడియోలను కూడా విడుదల చేసింది. ఇందులో ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లు తేలింది. అయితే బీజేపీ నేతలెవరూ ఇందులో నేరుగా పాల్గొనలేదు. ఆడియోలో కానీ, వీడియోల్లో కానీ బీజేపీ నేతలెవరూ లేరు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాట్లాడిన వ్యక్తులంతా బీజేపీ అనుకూలురుగా పేరొందారు. అయితే వీళ్లు బీజేపీకోసమే బేరసారాలు సాగించారని టీఆర్ఎస్ చెప్తోంది. పోలీసుల FIRలో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు రెండు భిన్నమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఈ కేసు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. నిందితులను రిమాండ్ కు తీసుకునేందుకు అనుమతించింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బీజేపీ వేసిన పిటిషన్ పై హైకోర్టు మరో తీర్పు చెప్పింది. కేసు దర్యాప్తును తదుపరి విచారణ వరకూ ఆపాలని ఆదేశించింది. అయితే నిందితుల రిమాండ్ కు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని తేల్చింది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది హైకోర్టు.
ఇదిలా ఉండగానే నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామచంద్రభారతి, నంద కుమార్, సింహయాజి స్వామీజీలు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ శుక్రవారం రోజున లిస్ట్ చేయాలని రిజిస్ట్రార్ ను ఆదేశించారు. దీంతో ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే హైకోర్టులో దీనిపై రెండు కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు మూడో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో ఈ కేసులో మున్ముందు మరిన్ని ట్విస్టులు ఖాయంగా కనిపిస్తున్నాయి.
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ సర్కార్ కూలిపోతుందని పలువురు బీజేపీ నేతలు పదేపదే ప్రస్తావించడాన్ని ఆ పార్టీ ఎత్తి చూపుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు తమ నలుగురు ఎమ్మెల్యేలను వంద కోట్ల రూపాయలతో కొనేందుకు ప్రయత్నించిందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమంతా బూటకమని.. ఇదంతా టీఆర్ఎస్ ఆడిన డ్రామా అని బీజేపీ చెప్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో ఈ తతంగమంతా ప్లాన్ చేశారని చెప్తోంది. అంతేకాక.. ఇందులో బీజేపీ నేతలెవరైనా పాల్గొన్నారా అని ప్రశ్నిస్తున్నారు కమలం నేతలు. దీనిపీ సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే హైకోర్టులో ఆ పార్టీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు నిందుతులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.













