అసంతృప్తులకు రివర్స్ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైన కేసీఆర్..!!
తెలంగాణ పాలిటిక్స్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలంతా తమకు టికెట్ కావాలంటూ పార్టీ అధినేతల చుట్టూ తిరుగుతున్నారు. అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ లాబీయింగ్ లో నేతలు మునిగిపోయారు. ఇప్పుడు తాము ఉంటున్న పార్టీలో టికెట్ రాదని భావిస్తున్న కొందరు నేతలు వేరే పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పక్క చూపులు చూస్తున్న నేతలకు షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. ఈసారి కూడా గెలుస్తామని గట్టిగా నమ్ముతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో అధికార పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కానీ కేసీఆర్ మాత్రం సిట్టింగుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. సర్వేల ఆధారంగా కొంతమందికి సీట్లు రాకపోవచ్చని భావిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లోకి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా కొంతమంది పార్టీలో సీనియర్లుగా ఉంటున్నా టికెట్ దక్కించుకోలేని వాళ్లు ఈసారి చాలామంది కనిపిస్తున్నారు.
ఇలాంటి నేతలంతా వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ దక్కించుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి ఆ అవకాశాన్ని కోల్పోతే మళ్లీ ఐదేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి నియోజకవర్గాల్లో పరిస్థులు ఎలా మారతాయో చెప్పలేం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. టికెట్ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోయేందుకు చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా తెలిసింది. అందుకే ఇలాంటి నేతలెవరో గుర్తించేందుకు ఆయన వ్యూహం రచిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేస్తే ఇలాంటి అసంతృప్తులెవరో ముందుగానే తెలిసిపోతుంది. అప్పుడు వాళ్లపై చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
జులై 15 తర్వాత 80 స్థానాలకు పైగా అభ్యర్థులను ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. అప్పుడు ఆయా నియోజకవర్గాల్లో తమతో వచ్చేదెవరో, వీడేదెవరో తెలిసిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే అలాంటి నేతలను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనుకుంటున్నారు కేసీఆర్. పార్టీ కోసం పని చేయని అలాంటి నేతలు అవసరం లేదని, వాళ్లు ఉన్నా లేకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారాయన. ముందుగానే అలాంటి నేతలను వదిలించుకుంటే తమతో కలసి వచ్చే వాళ్లతో ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు తగిన సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్న నేతలకు పార్టీ అధినేతే రివర్స్ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.













