కేసీఆర్ కు అతి పెద్ద సమస్య ఇదే..!
తెలంగాణ పేరు వినిపిస్తే ఠక్కున కేసీఆర్ గుర్తుకొస్తారు. రాష్ట్రాన్ని సాకారం చేసిన ఘనత ఆయనది. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ ప్రజలు వరుసగా రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారు. పదేళ్లపాటు ఆయన అధికారంలో ఉన్నారు. అయితే ముచ్చటగా మూడోసారి కూడా తమదే పీఠం అని కేసీఆర్ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని ఆయన కానీ, ఆయన పార్టీ నేతలు కానీ అస్సలు ఊహించలేదు. అయిందేదో అయిపోయింది. ప్రజాతీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ ముందు అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడమే అసలైన సవాల్.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించాక మొన్న గద్దె దిగేవరకూ కేసీఆర్ కు తిరుగులేదు. ఆయన రాకెట్ స్పీడ్ తో ఎదిగిపోయారు. ఎక్కడా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. తెలంగాణ ఏర్పడక ముందు తనదైన దూకుడుతో రాజకీయాలను శాసించారు. అధికారంలోకి వచ్చాక ఇక తిరుగే లేకుండా పోయింది. ఆయన చెప్పిందే వేదం. సెక్రటేరియేట్ కు వెళ్లకుండానే పాలన సాగించిన ముఖ్యమంత్రిగా ఆయన్ను చెప్పుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి ఆయన పవరేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది.
కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేజిక్కించుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం మీడియా ముందుకు రాకుండానే ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ప్రజల తీర్పుపై కనీస స్పందన కూడా లేదు. అదే సమయంలో ఆయన కింద పడడం, శస్త్ర చికిత్స జరగడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. నిన్నే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ శ్రేణులు పదేపదే చెప్తున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై కన్నేశారు. ఆ పార్టీలోని కొంతమంది ప్రజా ప్రతినిధులను ఆకర్షించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం నోరుజారినా కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. ఇది బీఆర్ఎస్ లో కలకలం రేపింది. త్వరలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ కు చేరువ కాబోతున్నారని సమాచారం.
ఇలాంటి నేతలను కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆపగలగడమే కేసీఆర్ ముందున్న అతిపెద్ద సవాల్. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీఆర్ఎస్ తెరదించితే తాను కూడా తగ్గేదే లేదని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రేవంత్ స్పష్టం చేశారు. బహుశా ఇప్పుడు అదే జరుగుతున్నట్టుంది. రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు పదేపదే చెప్తుండడంతో ముందు జాగ్రత్తగా కొంతమంది ఆ పార్టీ నేతలను తనవైపు తిప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పార్టీలో కేసీఆర్ మాటకు తిరుగులేకుండా పోయింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మాట వినే పరిస్థితులు చేజారిపోతున్నట్టు అర్థమవుతోంది. మరి ఈ సమస్యను కేసీఆర్ ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాలి.













