Congress-BRS Tieup: తెలంగాణలో కాంగ్రెస్, BRS కలవక తప్పదా?
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి. అధికార బీఆర్ఎస్ ఈసారి మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే కేసీఆర్ ను ఎలాగైనా ఓడించి తీరుతామని బీజేపీ, కాంగ్రెస్ చెప్తున్నాయి. ఇన్నాళ్లూ రెండు పార్టీల మధ్యే యుద్ధం నడిచేది. ఇప్పుడు ట్రయాంగిల్ వార్ ఏర్పడడంతో ఏ పార్టీకి విజయావకాశాలు ఉంటాయనేది అంచనా వేయడం కష్టంగా మారుతోంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 60 సీట్లు సాధించే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలవుతుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లూ బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తోంది. ఈసారి కూడా నెగ్గితే హ్యాట్రిక్ కొట్టొచ్చు. తెలంగాణలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్.. ఈసారి పార్టీని గెలిపించి ఢిల్లీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ కుమారుడు కేటీఆర్ ను సీఎం సీటులో కూర్చోబెట్టి హస్తినలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే కేటీఆర్ ను యాక్టివేట్ చేశారు.
అయితే ఈసారి కేసీఆర్ కు అంత సీన్ లేదంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను గద్దె దించుతామని బీజేపీ చెప్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఇప్పటికీ కేడర్ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. కొంతమంది నేతలు మాత్రమే ఆ పార్టీకి పైన కనిపిస్తున్నారు. వారి మధ్య కూడా విభేదాలు ఉండడం బీజేపీకి పెద్ద సమస్యగా మారింది. అయితే ఎత్తులకు పైఎత్తులు వేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి .. లేదంటే ఎన్నికల తర్వాత కూడా అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ తప్పకుండా ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆ పార్టీలో ఉన్నన్ని అంతర్గత విభేదాలూ మరే పార్టీలోనూ లేవు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీని తన భుజాలపై వేసుకున్నారు. ఆయన తన పనేదో తాను చేసుకుపోతున్నారు. మిగిలిన సీనియర్ నేతలందా గోతికాడ నక్కలా కాచుకుని రేవంత్ ను ఎప్పుడు పడగొడదామా అని ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ రేవంత్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. కానీ నాయకత్వలోపం ఆ పార్టీకి పెద్ద మైనస్.
తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. తెలంగాణలో ఈసారి హంగ్ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 60 సీట్లు ఏ పార్టీకీ రాబోవని.. కచ్చితంగా రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కోమటిరెడ్డి వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తో కలిస్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ ఎలాగూ బీజేపీతో కలవదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారని.. అయితే పార్టీని పొగడాల్సిన అవసరం లేదని.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని కేసీఆర్ ఒప్పుకుంటే చాలని కోమటిరెడ్డి హితవు పలికారు. ఒకవేళ నిజంగా కోమటిరెడ్డి చెప్పినట్టు హంగ్ ఏర్పడితే కేసీఆర్ కాంగ్రెస్ తో కలుస్తారా..? అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.













