బండి సంజయ్ కొనసాగింపు..! అసంతృప్తులకు చెక్?
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చాలా సీరియస్ గా ట్రై చేస్తోంది. కేంద్ర యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం కూడా పట్టుదలగా కనిపిస్తోంది. బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇచ్చాక పార్టీ దూకుడు పెరిగిందని, అధికార బీఆర్ఎస్ ను సమర్థంగా ఎదుర్కొంటోందని హైకమాండ్ నమ్ముతోంది. అయితే ఆయన పదవీకాలం పూర్తి కావడంతో బండి సంజయ్ ని మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది బీజేపీ హైకమాండ్.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని కొనసాగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ మేరకు ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చినా.. తెలంగాణ బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తప్పించలేదు. పైగా బండి సంజయ్ పై పూర్తి నమ్మకం ఉందని.. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని నడ్డా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికల వరకూ తానే అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్న బండి సంజయ్ కు ఇది శుభవార్త.
ఇటీవల బండి సంజయ్ పై పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ నియంతృత్వ పోకడల వల్ల పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాళ్లు ఆరోపించారు. బండి సంజయ్ ని మార్చాలని అంతర్గతంగా హైకమాండ్ కు నివేదించారు. దీంతో ఎన్నికల ముంగిట అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు బండ్ సంజయ్ ని మార్చి అందరికీ ఆమోదయోగ్యమైన లీడర్ కు బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. బండి సంజయ్ వైపే హైకమాండ్ మొగ్గు చూపింది.
వాస్తవానికి తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. పలువురు నేతలు అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్నారు. టికెట్లు ఇవ్వడంతో పాటు పార్టీ గెలిస్తే సీఎం సీటు దక్కే అవకాశం ఉండడంతో చాలా మంది నేతుల ఈ పదవికోసం తహతహలాడుతున్నారు. అందుకే ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ తో అంటీముట్టక ఉంటున్నారు. పైగా బండి సంజయ్ నియంతృత్వాన్ని సహించలేకపోతున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఎన్నికలకు బండి నేతృత్వంలోనే వెళ్తామని హైకమాండ్ తేల్చేసింది.













