మునుగోడులో రేపే పోలింగ్..! ఓటరన్నా.. ఓటు విలువ నిలబెట్టు!!
రేపే మునుగోడు పోలింగ్.. రెండు నెలలుగా సందడిగా ఉన్న మునుగోడు ఇప్పుడు తుపాను ముందు ప్రశాంతతలాగా కనిపిస్తోంది. రేపు పరీక్షకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఓటరు నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లూ పడ్డారు అభ్యర్థులు. నోట్లు పంచారు.. మందు పంపిణీ చేశారు. చికెన్, మటన్ లాంటి తాయిలాలతో వారిని తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలూ చేశారు. ఓటర్లు కూడా ఇచ్చిన ప్రతిపార్టీ దగ్గరా కాదనకుండా తీసుకున్నారు. ఒకవేళ తమకు ఎవరైనా ఇవ్వకపోతే నిలదీస్ మరీ అడిగారు. ఎందుకివ్వరని ప్రశ్నించారు.
మునుగోడు కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక. ఓ వ్యక్తి పౌరుషానిక పోయి, పార్టీ మారి తెచ్చిన ఎన్నిక. దీంతో మిగిలిన పార్టీలు పట్టుదలకు పోయి హోరాహోరీ తలపడుతున్నాయి. నెలరోజులకు పైగా బీభత్సంగా ప్రచారం చేసిన పార్టీలన్నీ ఇప్పుడు ఓటరు తీర్పుకోసం ఎదురు చూస్తున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మునుగోడులో మొత్తం 2లక్షల 41వేల మంది ఓటర్లు ఉన్నాయి. 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 35 అర్బన్ కేంద్రాలు కాగా.. 263 రూరల్ ఏరియాల్లో ఉన్నాయి. మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సుమారు 7 కోట్ల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. అలాగే దాదాపు 5వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి ఇక్కడ మద్యం, డబ్బు ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
అభ్యర్థులు డబ్బులిచ్చారు.. ఓటర్లు తీసుకున్నారు. కానీ అభ్యర్థుల్లో మాత్రం ఇంకా టెన్షన్ అలాగే ఉండిపోయింది. తమదగ్గర తీసుకున్న వాళ్లంతే తమకే ఓటేస్తారనే నమ్మకం ఎవరికీ కలగట్లేదు. ఇన్నాళ్లు తాము పెట్టిన సభలకు వచ్చారు. పెట్టింది తిన్నారు.. పోసింది తాగారు.. ఇచ్చింది తీసుకున్నారు.. కానీ ఎక్కడో ఏదో ఆందోళన మాత్రం అందరినీ వెంటాడుతోంది. ఎందుకంటే చివరి నిమిషం వరకూ ఓటరు తమవైపే ఉంటారనే నమ్మకం ఎవరికీ కలగట్లేదు. అందుకే చివరి నిమిషం వరకూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అభ్యర్థులు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేంత వరకూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..
అయితే ఇక్కడ ఓటరుదే నిర్ణయాత్మక పాత్ర. ఇన్నాళ్లు డబ్బుకు, మద్యానికి, బిర్యానీలకు ఆశపడి ప్రవర్తించారు సరే. కానీ ఇప్పుడు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అభ్యర్థులు తమ పంతాలకు, పట్టింపులకు, స్వప్రయోజనాలకు పోయి ఉప ఎన్నిక తీసుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు ఓటరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓటు ప్రతి పౌరుడి హక్కు. అస్తిత్వానికి ప్రతీక. ఓటుతో ప్రపంచ గతినే మార్చేయవచ్చు. డబ్బు ఉంది కదా అని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా… మనకున్న ఓటు హక్కుతో వారిని ఇంటికి సాగనంపొచ్చు. అదీ ఓటుకున్న పవర్. అదే ఓటుతో మన తలరాతను మార్చుకోవచ్చు. అందుకో ఓటర్లందరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లే మందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. తాయిలాల విషయం పక్కనపెట్టి మంచి వ్యక్తులను, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే వారిని ఎన్నికోవాల్సి ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం దొరుకుతుంది.













