మరోసారి వార్తల్లో నిలుస్తున్న మల్కాజిగిరి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రోజురోజుకూ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల పక్క చూపులు ఎక్కువయ్యాయి. అసంతృప్తితో కొందరు, సేఫ్ జోన్ కోసం మరికొందరు పార్టీలు మారుతున్నారు. నచ్చిన పార్టీ తరపున నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ దక్కినా పార్టీకి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఆయన రాజీనామాతో ఇక్కడ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
మైనంపల్లి హనుమంతరావు సీనియర్ రాజకీయ నాయకుడు. చాలాకాలంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆయనకు అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే మైనంపల్లి మాత్రం తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు కూడా ఈసారి టికెట్ కావాలని పట్టుబట్టారు. మైనంపల్లి రోహిత్ ను మెదక్ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలనేది ఆయన ఆలోచన. అయితే కేసీఆర్ ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. మైనంపల్లి హనుమంతరావుకు మాత్రం మళ్లీ మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగేందుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడానికి హరీశ్ రావే కారణమని మైనంపల్లి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇది బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
మైనంపల్లి హనుమంతరావు పార్టీ నియమాలను ధిక్కరించినా కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. చూస్తూ ఊరుకుండిపోయారు. అయితే మైనంపల్లి మాత్రం తన కుమారుడికి సీటు ఇవ్వకపోతే తాను కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేయబోనంటూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరికి టికెట్స్ ఇస్తామని హామీ లభించినట్టు సమాచారం. అందుకే టికెట్ దక్కినా కూడా పార్టీ మారుతున్నారు మైనంపల్లి.
మైనంపల్లి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఆ పార్టీలో అసంతృప్తి మొదలైంది. మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న నందికంటి శ్రీధర్ తనకు టికెట్ దక్కుతుందని చాలా కాలం నుంచి ఆశిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయన అక్కడ పని చేస్తున్నారు. దీంతో ఆయన అనుచరులందరూ నందికంటి శ్రీధర్ కే టికెట్ ఖాయమనుకున్నారు. ఇప్పుడు మైనంపల్లి రాకతో శ్రీధర్ కు టికెట్ రాదని అర్థమైంది. దీంతో శ్రీధర్ అనుచరులంతా ఆయన్ను పార్టీ మారాలని సూచిస్తున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి పైన ఎవరిని బరిలోకి దింపుతారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. అయితే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజిగిరి నుంచి మైనంపల్లిపైన పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన తాజాగా మల్కాజిగిరిలో ర్యాలీ నిర్వహించడంతో ఇది నిజమని తెలుస్తోంది. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపడం ద్వారా మైనంపల్లికి చెక్ పెట్టవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. మొత్తానికి మల్కాజిగిరి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.













