సింగరేణిపై ‘ఎర్ర’ జెండా..
నల్లసూరీళ్లు ఎర్రజెండాను భుజాలకెత్తుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో జాతీయ సంఘాలు సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో ఏఐటీ యూసీ గెలుపొందింది. దీంతో ఎర్రజెండా యూనియన్ ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా ప్రకటించారు. ఈ గెలుపు ఎరుపుదళంలో ఆనందోత్సాహాలను నింపింది. అయితే..బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం – TBGKS ఘోర పరాజయం మాత్రం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇంతకూ బొగ్గుగని ఎన్నికల్లో ఏం జరిగింది?
ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిందో.. ఇంకేముంది గులాబీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు నైరాశ్యంలో పడిపోయారు. పైనుంచి గులాబీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినా … TBGKS నేతలు పట్టించుకోలేదు. ఇంక ఈ సంఘంతో కుదరదని చెప్పి సీనియర్లు, ఇతర నేతలు.. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలలో చేరి పోటీకి దిగారు. TBGKS గుర్తు బాణానికి ఓటేయమని అడిగే నాథుడే లేకపోయారు. దీంతో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ నామమాత్రంగా మారింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్‌కు.. సింగరేణిలో పవర్ దక్కకుండా చేయాలని బీఆర్ఎస్ వ్యూహంలో ఇది కూడా భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు గానూ.. బీఆర్ఎస్ అనుబంధ సంఘం నేతలు.. అవుట్రైట్గా ఏఐటీయూసీకి మద్దతు పలికారని.. అందుకే ఆసంఘం విజయం సాధించినట్లు సమాచారం. తాము గెలవకున్నా పర్వాలేదు.. కానీ కాంగ్రెస్ జెండా ఎగురకూడదన్న ఆశయంతోనే బీఆర్ఎస్.. ఇలా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే..దీంతో బీఆర్ఎస్ సాధించినదేమిటన్నది అంతుచిక్కని విషయం.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లయినా.. గత సీఎం కేసీఆర్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఒకే ఒక్కసారి నిర్వహించారు. 2017 నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేక హామీలు ఇచ్చారు. దీంతో జాతీయ సంఘాలను కాదని కార్మికులు ప్రాంతీయ సంఘానికి పట్టం కట్టారు. అంతకుముందు 2013లోనూ టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచింది. నాడు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సింగరేణి కార్మికులు కూడా స్థానిక సంఘాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు.
సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించగా ఏఐటీయూసీ 6 డివిజన్లలో ఐఎన్‌టీయూపీ 5 డివిజన్లలో ప్రాతినిధ సంఘాలుగా విజయం సాధించాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్ పరిధిలోని రామగుండం–1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం–3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి.













