ఫ్రీగా విమానయానం : స్పైస్‌జెట్
వివిధ రకాల ఆఫర్లతో విమానయాన సంస్థలు ప్రయాణికులను ఊరిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థలు తగ్గింపు ధరలకే టికెట్లను అందిస్తుండగా స్పైస్‌జెట్ అందుకు భిన్నమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఉచితంగానే విమాన ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తోంది. ప్రయాణానికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వోచర్ రూపంలో చెల్లిస్తోంది. డిసెంబర్ 1నే ఈ ఆఫర్ ప్రారంభం కాగా, ఈ నెలాఖరు వరకు వర్తిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 31 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనికోసం ప్రయాణికులు తొలుత స్పైస్‌జెట్ వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఛార్జీలతో కలిపి టికెట్ మొత్తాన్ని సదరు పోర్టల్ ద్వారా చెల్లించాలి. ఆ లావాదేవీ పూర్తయిన తర్వాత స్పైస్‌జెట్‌కు చెందిన స్పైస్స్టైల్ డాట్ కామ్ షాపింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అందులో స్టైల్ క్యాష్లోని మై అకౌంట్ సెక్షన్లో ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చిన కోడ్ ఎంటర్ చేయడం ద్వారా టికెట్‌కు చెల్లించిన మొత్తం సొమ్ము స్టైల్ క్యాష్‌లో జమవుతుంది. ఈ మొత్తాన్ని అదే వెబ్సైట్లో కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా 30 శాతం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని 2018 మార్చి 31 లోపుగా వాడుకోవాలి. ఒక పిఎన్ఆర్ నెంబర్‌కు ఒక వోచర్ మాత్రమే ఇస్తారని స్పైస్‌జెట్ తన వెబ్సైట్లో పేర్కొంది.













