పాపం సైనికులు: వాళ్లకు కిలో ఉప్పు రూ.150
కిలో ఉప్పు కొనాలంటే.. 10 నుంచి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే కిలో చక్కెరకైతే రూ.40 ఉంటుంది. కానీ ఆ ఊర్లో మాత్రం… వీటి ధరలు గుండెలు అదిరేలా ఉన్నాయి. ఉప్పు ఏకంగా రూ.150, చక్కెర రూ.200. ఈ రేట్లు చూస్తుంటే.. ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. ఇదేదో ఆఫ్రికా దేశంలోనో అనుకునేరు. మనదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఈ రేట్లున్నాయి. అదీ ఎవరికి అనుకున్నారు. మాజీ సైనికులకు… అదేంటి సైనికులకు డిస్కౌంట్లు ఉంటాయి కదా.. మరి వీరికేంటి ఈ స్పెషల్ రేట్లు అనుకుంటున్నారా.. అదే మరి అసలు విషయం..
దేశ రక్షణ కోసం సర్వస్వం వదులుకున్న సైనికులు. ఆశ్చర్యంగా ఉంది కదూ… దీనిపై మరింత క్లారిటీ రావాలంటే.. మయన్మార్ – ఇండియా సరిహద్దుల్లోని విజయ్‌నగర్ గ్రామం గురించి తెలుసుకోవలసిందే. దట్టమైన అడవుల్లో 8వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ 1972లో ఇక్కడి వచ్చారు. అప్పటికింకా భారత్ – మయన్మార్ ల మధ్య సరిహద్దులు నిర్ణయించలేదు. ఆ సమయంలో 1971 వరకు పదవీ విరమణ పొందిన సైనికులను ఇక్కడికి పంపించారు. సర్వసదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో ఇక్కడికి వచ్చేశారు కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చారు సైనికులు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ సరైన సదుపాయమే లేదు. రోడ్లు.. సమాచార వ్యవస్థ.. విద్యుత్.. పాఠశాలలు ఇలా మౌలిక సదుపాయాలు ఏవీ అక్కడ లేవు. అక్కడ నిత్యావసర ధరలు చూస్తే సామాన్యులకు దిమ్మతిరిగిపోవాల్సిందే. ఉప్పు.. పప్పు.. పంచదార ఇలా ఏదైనా వందల్లో పెట్టి కొనాల్సిందే. ఎందుకంటే.. వేరే ప్రాంతంలో కొనుక్కోవాలంటే.. దాదాపు 7 నుంచి 10రోజులు నడక మార్గంలో వెళ్లాలి. ఇంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నది మాజీ సైనికులు.
కేవలం ఆహార పదార్థాలే కాదు.. ఒక ఫొన్ కాల్ చేసుకోవాలంటే నిమిషానికి రూ.5 చెల్లించాలి. వారి రోజువారి ఆదాయం రూ. 200 ఉండగా ఏ వస్తువు కిలో కొన్నా రూ.150 ఖర్చు అవుతుంది. అనారోగ్యం వస్తే ఆస్పత్రి 200కి.మీ దూరంలో ఉంది. అక్కడకి విమానంలో తప్ప వేరే మార్గం లేదు. ఇలా అయితే ఎలా బతకాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













