Vijaya Sai Reddy: విజయసాయి రెడ్డి తెలివిగా తప్పించుకున్నారా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనానికి కారణమైంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) విజయ సాయి రెడ్డి రాజీనామా పెద్ద షాక్ అనే చెప్పాలి. జగన్ (YS Jagan) తర్వాత నెంబర్ టూ గా ఉన్నారు విజయసాయి రెడ్డి. వైఎస్ ఫ్యామిలీతో (YSR Family) నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి పార్టీని వీడడం వైసీపీ నేతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే విజయసాయి రెడ్డి చాలా వ్యూహాత్మకంగా తప్పుకోవడం కంటే.. తప్పించుకున్నట్టు అర్థమవుతోంది.
వైఎస్ ఫ్యామిలీతో విజయసాయి రెడ్డికి రాజారెడ్డి (YS Raja Reddy) కాలం నుంచి అనుబంధం ఉంది. వాళ్ల కంపెనీల వ్యక్తిగత ఆడిటర్ (Auditor) గా విజయసాయి రెడ్డి పని చేస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా (YSR) ఉన్నప్పుడు పలు కంపెనీలను వైఎస్ కుటుంబ కంపెనీలకు బదలాయించడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం నమోదైన కేసుల్లో విజయసాయి రెడ్డి జగన్ తో పాటు జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఆ తర్వాత జగన్ ఆయన్ను రాజ్యసభకు పంపించారు. ఢిల్లీలో చక్రంతిప్పే అవకాశం కల్పించారు. వైఎస్ హయాం నుంచి విజయసాయి రెడ్డి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పదుల సంఖ్యలో కేసులు ఆయనపై నమోదయ్యాయి.
తమపై నమోదైన కేసుల విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడంలో జగన్, విజయసాయి రెడ్డి సక్సస్ అయ్యారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో విజయసాయి రెడ్డి బెదిరింపులు, విశాఖలో భూ అక్రమాలు, దేవదాయ శాఖ అధికారిణితో అక్రమ సంబంధం ఆరోపణలు.. లాంటివి విజయసాయిని ఇరుకున పెట్టాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇప్పటికే ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కాం వ్యవహారంలో కూడా ఈయన పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. వీటన్నిటినీ తిరగదోడేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
వైసీపీలోనే కొనసాగితే తనకు శిక్ష పడడం ఖాయనే భావనకు విజయ సాయి రెడ్డి వచ్చినట్టు సమాచారం. అందుకే బీజేపీ (BJP) శరణు కోరినట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు కూడా ఇందులో తాము చేయగలిగిందేమే లేదని.. రాజకీయాల నుంచి తప్పుకును నీ పని నువ్వు చేసుకుంటే బెటర్ అని సలహా ఇచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే విజయసాయి రెడ్డి తప్పుకున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే జగన్ ను ఇరికించేందుకు, తాను క్షేమంగా బయటపడేందుకు విజయసాయి రెడ్డి తెరవెనుక డీల్ సెట్ చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటన్నిటికీ త్వరలోనే సమాధానాలు వచ్చే అవకాశం ఉంది.













