YSRCP: ప్రజల గొంతుకగా వైసీపీ..తిరిగి ప్రభుత్యం మనదే..
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని(YCP formation day) పురస్కరించుకుని కీలక ప్రకటనలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో (Thadepalli party office) వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించిన ఆయన, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల కోసం ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ అని, ఇది ఎల్లప్పుడూ ప్రజల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్తేమీ కాదని, గతంలో కూడా దశాబ్దం పాటు ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కూటమి పాలనపై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొద్ది నెలల్లోనే ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేయడంలో విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలు నెమ్మదించాయి, ప్రజలకు అవసరమైన సేవలు అందడంలో లోపాలు వస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి విద్యాసంబంధిత పథకాలకు సరైన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తగినంత కేటాయించకుండా బాధ్యత నుంచి తప్పించుకుందన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని జగన్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వం, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిందని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. తమ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందన్నారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలు పార్టీకి అసలైన బలం అని జగన్ అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లుగా పార్టీతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి, భవిష్యత్లో వైఎస్సార్సీపీ నడిపించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని చెప్పారు. ప్రజల సమస్యలను వెలికి తీసి పోరాడాల్సిన సమయం వచ్చిందని, ఇకనైనా కూటమి ప్రభుత్వ తీరుపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు తమ పార్టీపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి రుజువు చేస్తారని, త్వరలోనే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.













