ముందస్తు బెయిల్ ఇవ్వండి : అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలు సార్లు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి గతంలోనే అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, అరెస్టు చేయవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. త్వరలోనే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరినట్టు సమాచారం. వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో సీబీఐ విచారణ వేగవంతం కానుండటంతో అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.













