Vivekananda Reddy: వివేకా హత్య కు ఆరేళ్లు.. న్యాయం కోసం గవర్నర్ ను కలిసిన సునీత..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకు 2025 మార్చి 15 నాటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఆయన 2019 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోయే సమయంలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మొదట వైసీపీ (YCP) నాయకులు హఠాన్మరణం అంటూ ప్రకటించగా, ఆ తర్వాత పోస్టుమార్టం నివేదికలో ఆయన గొడ్డలి దాడిలో హత్యకు గురయ్యారని తేలింది.
వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ, టీడీపీ (TDP) మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీనే దీనికి బాధ్యులంటూ వైసీపీ నేతలు ఆరోపించగా, మరోవైపు వైసీపీ నేతలే ఇందులో ప్రమేయమున్నారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. మొదట వైసీపీ సీబీఐ దర్యాప్తిని డిమాండ్ చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్ర పోలీసులతోనే విచారణ కొనసాగించింది. అయితే వివేకానందరెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం చేయడంతో కేసును సీబీఐకి అప్పగించారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న మూడేళ్లలోనూ కేసు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లలేదు. ఈ కేసుపై ప్రభుత్వ పక్షం నుండి పూర్తిస్థాయి సహకారం అందలేదన్న విమర్శలు వినిపించాయి.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలకు చేరువైంది. కానీ ఇప్పటికీ వివేకా హత్య కేసు పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజాగా సునీత గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలసి ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆమె తన తండ్రి హత్యకు సంబంధించిన అన్ని వివరాలను గవర్నర్‌కు తెలియజేశారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరిని తప్ప మిగిలిన వారంతా బెయిల్‌పై బయట ఉన్నారని తెలిపారు. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారిని శిక్షించేందుకు ఇంత ఆలస్యం ఎందుకు అవుతోందో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లోనైనా ఈ కేసు తీర్పు త్వరగా రావాల్సిందేనని భావిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆమెకు ప్రస్తుతం అధికార కూటమిలో మంచి అనుబంధం ఉన్నప్పటికీ కేసు పురోగతిలో స్పష్టత కనిపించడం లేదు. ఇదే హత్య కేసు గత ఎన్నికల్లో వైసీపీకి భారీగా నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీకి ఓటమి కారణాల్లో ఇది ఒకటిగా మారింది. సునీత, షర్మిల లాంటి వారు ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు కేసు ముందుకు సాగితే దోషులెవరో తేలే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసును ప్రభుత్వం నిజమైన న్యాయబద్ధతతో చేదించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుందా లేక రాజకీయంగా ఉపయోగించుకుంటుందా అన్నది చూస్తే కానీ అర్థం కాదు. చివరికి ఈ హత్యకు పాల్పడింది ఎవరు? ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేలా ఈ కేసు ముందుకు సాగుతుందా అన్నదే ఉత్కంఠగా మారింది.













