మళ్లీ స్పెషల్ స్టేటస్ చిచ్చు రాజేస్తున్న షర్మిల..!! ఎవరు టార్గెట్..?
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పీడ్ పెంచారు. తెలంగాణ నుంచి తట్టాబుట్టా సర్దేసుకుని ఏపీకి మకాం మార్చేసిన ఆమె ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిన రాష్ట్రం మళ్లీ దాన్ని గట్టెక్కించేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తన దగ్గరున్న అస్త్రాలన్నింటినీ ఆమె వినియోగిస్తున్నారు. అందులో ముఖ్యమైనది స్పెషల్ స్టేటస్. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక హోదా అటకెక్కింది.
రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతోంది. విడిపోయిన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీ, బీజేపీ కలిసే ఉన్నాయి. మొదట్లో ప్రత్యేక హోదా కోసం టీడీపీ గట్టిగానే ప్రయత్నించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హోదా సాధ్యం కాదని.. అందుకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం సూచించింది. దానికి అంగీకరించిన చంద్రబాబు.. ఆ మేరకు నిధులను తెచ్చుకున్నారు. స్పెషల్ స్టేటస్ ను అటకెక్కించారు. అయితే చివర్లో బీజేపీతో ప్రయాణం బెడిసికొట్టడంతో మళ్లీ స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమించారు చంద్రబాబు. అయితే చంద్రబాబును జనం తిరస్కరించడంతో ఆయన ప్రతిపక్షానికి పరిమితమైపోయారు.
ఇక 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాతికమంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్నారాయన. అయితే అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ పై జగన్ కూడా పెద్దగా నోరు విప్పలేకపోయారు. కేంద్రంలోని బీజేపీతో స్నేహమే ఇందుకు కారణం. దీంతో స్పెషల్ స్టేటస్ ఏపీకి తీరని కలగానే మిగిలిపోయింది. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంలోని బీజేపీతో అంటకాగి రాష్ట్రానికి అన్యాయం చేశారనే ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇదే అస్త్రాన్ని పట్టుకున్నారు షర్మిల.
ఏపీకి ప్రత్యేక హాదా అనేది విభజనచట్టంలోని హామీ. వాస్తవానికి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయితే వివిధ కారణాల రీత్యా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికీ చెప్తోంది. దీంతో ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా అటు చంద్రబాబు, జగన్ తో పాటు ఇటు బీజేపీని కూడా టార్గెట్ చేసినట్లవుతుంది. అందుకే షర్మిల ప్రత్యేక హోదాను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. అయితే హోదాపై ఏపీ ప్రజలు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. మరి షర్మిల ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.













