ఆ ప్యాకేజీ కోసమే కేంద్రంతో కుస్తీ : సీఎం జగన్
పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆయన మాట్లాడారు. నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి లేఖలు పంపిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్‌లోపు పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయబోమని తెలిపారు. నాలుగు ముంపు మండలాలను ప్రత్యేక డివిజన్‌గా చేసేందుకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు.
పోలవరం ఆర్అండ్ఆర్ నిధుల కోసం కేంద్రంతో యుద్ధాలు, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. బతిమిలాడుతూనే ఉన్నాం. సెప్టెంబర్‌లోగా నిర్వాసితులకు డబ్బులు చెల్లిస్తాం. ప్రాజెక్టుకు రాష్ట్రం తరపున రూ.20 వేల కోట్ల ఖర్చు అయింది. కేంద్రం నుంచి ఆ డబ్బు రావాలి. పోలవరం ప్రాజెక్టు కట్టినా అందులో పూర్తిగా నీళ్లు నింపం. మొదట 41.15 మీటర్ల మేరకు నింపుతాం. ఒకేసారి నీరు నింపితే డ్యామ్ భద్రతకు ప్రమాదం. డ్యామ్‌లో పూర్తిగా నీరు నింపడానికి కేంద్రం జలసంఘం ఒప్పుకోదు. మొదట డ్యామ్ సగం వరకు. మూడేళ్లలో పూర్తిగా నీరు నింపేస్తాం. పూర్తిగా నింపే నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగన్విం అని అన్నారు.













