కోవిడ్ రోగులకు 50 శాతం బెడ్లు ఇవ్వాల్సిందే : సీఎం జగన్ ఆదేశాలు

కోవిడ్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు కచ్చితంగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 50 శాతం బెడ్లు కేటాయించిన తర్వాత, రోగుల తాకిడి పెరిగినా సరే తప్పకుండా వారిని చేర్చుకోవాలని నిబంధన విధించారు. టెంపరరీ ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అలాగే కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలని సూచించారు. కోవిడ్ చికిత్స కోసం అవసరమై మేరకు బెడ్ల సంఖ్యను పెంచాలని, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అయితే ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి? వాటిలో కోవిడ్ రోగులకు ఎన్ని ఇస్తున్నారన్న జాబితా అధికారుల వద్ద ఉండాలని, అలా ఉంటే పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందన్నారు.
ఏ ఆస్పత్రి కూడా రోగి నుంచి ఇష్టమున్న రీతిలో డబ్బులు వసూలు చేయకుండా ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాలని ఆదేశించారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల వద్ద కోవిడ్ కేర్ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని సీఎం పేర్కొన్నారు. ఆస్పత్రి వైద్యులే అక్కడ సేవలందించాలని, అక్కడ మాత్రం అన్ని వసతులూ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో ఆహార నాణ్యత, శానిటేషన్, డాక్టర్ల అందుబాటు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ ఈ ఐదు తప్పకుండా అందుబాటులో ఉండాలన్నారు. ఆక్సిజన్ సరఫరా, నిల్వలో ఎక్కడా లోపం రాకూడదని, ఎక్కడైనా వస్తే తగిన మరమ్మతులు చేసి తిరిగి పునరుద్ధరించాలని సూచించారు. ప్రతీ టీచింగ్ ఆస్పత్రి వద్ద 10 కెఎల్ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ స్టోరేజీ ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.