సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్.. వైద్య ఆరోగ్యశాఖలో భారీగా
ఆంధ్రప్రదేశ్లో వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి, నవంబర్ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఉంది. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశం చేశారు.













