YS Jagan : ప్చ్… మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) పునర్నిర్మాణ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) హాజరై అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని (YS Jagan) కూడా ఆహ్వానించారు. అయితే, జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన పొలిటికల్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు, అమరావతికి తాను సానుకూలమేనని చెప్పేందుకు జగన్ కు ఇదొక అద్భుతమైన అవకాశం. కానీ దాన్ని ఆయన మిస్ చేసుకున్నట్టయింది.
అమరావతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పద అంశంగానే ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారీ ప్రణాళికలు రూపొందించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానుల విధానాన్ని ప్రతిపాదించారు. ఇది అనేక సమస్యలకు కారణమైంది. అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్లు తమ భూములను రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారు. 1,631 రోజుల పాటు అమరావతి రైతులు నిరసనలు చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు దాఖలు చేశారు. దీంతో జగన్ మూడు రాజధానుల విధానం ముందుకు సాగలేదు.
2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి పునర్నిర్మాణం మళ్లీ వేగం పుంజుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలనే చంద్రబాబు సంకల్పించారు. కూటమి పార్టీలన్నీ ఇదే విధానానికి కట్టుబడి ఉండడంతో అమరావతిని పూర్తి చేయాలని సంకల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఇవాళ దానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో భాగంగా మాజీ సీఎం జగన్ ను కూడా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని జగన్ తాడేపల్లిలోని నివాసంలో అందజేశారు. అయితే, జగన్ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి బెంగళూరు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే జగన్ అమరావతి అభివృద్ధికి మద్దతు పలికినట్లు చూపించే అవకాశం ఉండేది. ఇది వైసీపీకి ప్రజల్లో సానుకూల ఇమేజ్‌ను తెచ్చిపెట్టేది.
జగన్ ఈ కార్యక్రమానికి హాజరై ఉంటే అమరావతికి తాను మద్దతు పలికినట్లు చర్చ జరిగేది. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో ఆయనే హైలైట్ గా నిలిచేవారు. దేశవ్యాప్తంగా ఆయనపై చర్చ విస్తృతంగా జరిగేది. ఆయనకు రాజకీయంగా ఒక గొప్ప అవకాశంగా మారేది. మూడు రాజధానుల విధానం వల్ల ఏర్పడిన విమర్శల నుంచి బయటపడేందుకు, ప్రజల్లో సానుకూల సందేశాన్ని పంపేందుకు ఇది ఒక బంగారు అవకాశం. ఈ కార్యక్రమాన్ని హైజాక్ చేసి, తన రాజకీయ ఉనికిని చాటుకునే వీలుండేది. కానీ జగన్ ఈ అవకాశాన్ని కోల్పోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.