ఐప్యాక్ హవా…
ఏపీలో వైసీపీ అత్యంత బలంగా కనిపిస్తోంది. జగనన్న ట్రేడ్ మార్కుతో సంక్షేమపథకాలు అమలు చేస్తోంది. దీంతో చూసేవారికి రాజకీయంగా అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ.. పార్టీలో ఉన్నవారికి మాత్రం ఉక్కపోత తప్పడం లేదు. పేరుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులు.. కానీ వారి మాట అమలు కావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందరినోట ఒకటే మాట.. ఐప్యాక్ హవా నడుస్తోందని చెబుతున్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నిమిత్తమాత్రులు. ఒక్క మాటలో చెప్పాలంటే పానకంలో పుడకలు లాంటి వారు అని ఒక టాక్ నడుస్తోంది. ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయాల్లోకి వెళ్లినా. ఆయన ఐ ప్యాక్ టీమ్ వైసీపీ సర్కారును వెనకుండి నడిపిస్తోంది. సాక్షాత్తూ వైసీపీనేతలు.. ఈవిషయంలో తాము నిమిత్తమాత్రులమని చెబుతున్నారు. చివరకు జగన్ సన్నిహితులది సైతం ఇదే అభిప్రాయం. అయితే ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు, మంత్రుల గుణగణాలను చూసిన ఈ బృందం పాలనలోనూ చేయి పెడుతోంది.
నాలుగేళ్లుగా వైసీపీ సర్కారు సంక్షేమంతో నెట్టుకొచ్చింది. అభివృద్ధి ఊసే ఎత్తలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఏపీ రోడ్లపైనా చినజీయర్ అప్పట్లో కామెంట్ చేశారు. తర్వాత తెలంగాణ నేతలు సైతం..ఏపీ ఎంత వెనకబడి ఉందో.. రోడ్లను చూస్తే అర్థమవుతుందన్నారు.మరోవైపు… గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో జనంలోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరసనలు ఎదురవుతున్నాయి. పార్టీ వర్క్ షాపుల్లో తమ పరిస్థితిని ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకరవు పెడుతున్నారు. దీంతో ఎన్నికల చివరి ఏడాది కావడంతో మౌలిక వసతులపై ప్రభుత్వం కాస్తా దృష్టిపెట్టింది.
అయితే ఇక్కడ కూడా వైసీపీ ప్రజాప్రతినిధులకు షాక్ తగులుతోంది. మా నియోజకవర్గంలో పలానా చోట రోడ్లు వేయాలి, నిర్మాణాలు చేపట్టాల్సినవి అంటూ లిస్టు చెబుతుంటే..అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. అల్ రెడీ తమకు ఒక జాబితా వచ్చిందని చెబుతుండడంతో వైసీపీనేతలు షాక్ తింటున్నారు. ప్రజా వ్యతిరేకత అధికంగా ఉండే ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని ఐ ప్యాక్ ఆదేశాలిస్తోంది. వారిచ్చిన జాబితాల ప్రాప్తికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. తాము ప్రతిపాదించినవి కనీస పరిగణనలోకి తీసుకోకపోవడంతో వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.













