పెద్దాపురం ఎన్నికల ప్రచార సభలో వైయస్ జగన్
పొరపాటున మళ్లీ చంద్రబాబునాయుడుకు కనుక ఓటేస్తే ఇక ముందు ప్రభుత్వ పాఠశాలలు ఇక ఉండవని, గ్రామాలలో కూడా నారాయణ విద్యా సంస్థలే ఏర్పాటవుతాయని, అన్ని ఛార్జీలలో ఇక వీరబాదుడే అని, పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు ఉండబోవని, చంద్రబాబు తన ఇష్టానుసారం ఇళ్లు, భూములు లాక్కుంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అ««ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, నదులు దేన్నీ వదలకుండా అన్నీ దోచుకుంటారని, ఏవీ మిగలవని, లారీ ఇసుక లక్ష రూపాయలవుతుందని, గ్రామాలలో జన్మభూమి కమిటీలు అందరి జీవితాలను శాసిస్తాయని, రైతులు, పొదుపు సంఘాల మహిళలకు రుణాలు అందవని ఆయన పేర్కొన్నారు. ఇంకా గ్రామాలలో తనను వ్యతిరేకించే వారెవ్వరినీ చంద్రబాబు బతకనివ్వరని, అయినా కేసులుండవని, విషయం కూడా బయటకు రాదని, ఆ స్థాయిలో వ్యవస్థ, మీడియా మేనేజ్మెంట్ ఉంటుందని జననేత చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.
అన్నీ గుర్తున్నాయి
సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో పెద్దాపురంలో కూడా పర్యటించానని, అందరి బా«ధలు, కష్టాలు చూశానని, అవన్నీ గుర్తున్నాయని, ఇంకా గిట్టుబాటు ధరలు అందక రైతులు పడుతున్న అవస్థలు కూడా చూశానని శ్రీ వైయస్ జగన్ తెలిపారు.
గిట్టుబాటు ధరలు
ధాన్యం గిట్టుబాటు ధర రూ.1750 అయినా, రైతులకు కనీసం రూ.1300 కూడా రావడం లేదన్నారు. ఒకవైపు రుణమాఫీ జరగకపోవడం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా నష్టపోయారని ఆవేదన చెందారు.
టన్ను చెరుకు యూపీలో రూ.3150 ఉండగా, ఇక్కడ రూ.2800 వరకే వస్తోందని, 10 కిలోల బెల్లం నంబర్–1 రకానికి రూ.260 రావడం లేదని తెలిపారు. మహానేత వైయస్సార్ హయాంలో అదే బెల్లం రూ.520 కి అమ్మామని ఇక్కడి రైతులు చెబుతున్నారని తెలిపారు.
పోలవరం–అవినీతిమయం
పోలవరం ప్రాజెక్టు పనులు ఆనాడు మహానేత వైయస్సార్ హయాంలో చాలా వేగంగా సాగగా, ఇప్పుడు ప్రాజెక్టు పనులను పూర్తిగా అవినీతిమయం చేశారని, ప్రాజెక్టు పునాది గోడలు దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి, సబ్ కాంట్రాక్ట్‌లకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నారని, అలా పనులు చేస్తున్న వారిలో మంత్రి యనమల వియ్యంకుడు కూడా ఉన్నారని తెలిపారు.
‘నేను ఉన్నాను’
నియోజకవర్గంలో చేనేతకారులు ఎక్కువని, అయినా వారికి ఏ రకమైన ప్రోత్సాహం లేదని, నూలుపై సబ్సిడీ లేదని, ఇచ్చే సహాయం కూడా సకాలంలో ఇవ్వడం లేదని తెలిపారు.
అదే విధంగా పెద్ద సంఖ్యలో ఉన్న అగ్రి గోల్డ్ బాధితులకు ఈ 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా రాలేదని, వారందని బాధలు విన్నానని, కష్టాలు కూడా చూశానని.. అందుకే అందరికీ భరోసా ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
మోసం తప్ప?
ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏమిటి? అని అందరూ గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలన్న జననేత, అప్పుడు మనకు మోసం తప్ప మరేదీ కనిపించదని అన్నారు. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో చంద్రబాబు పన్నుతున్న కుట్రలతో పాటు, ఇన్నాళ్లూ చేసిన మోసం, అన్యాయమైన పాలన చూడాలని విజ్ఞప్తి చేశారు.
కాబట్టి పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే, అంతా అనర్ధమే అంటూ అంశాల వారీగా వాటన్నింటినీ ప్రస్తావించారు.
చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే?:
– ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా ఉండదు. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో 6 వేల స్కూళ్లు మూసేశారు.
టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. సమయానికి పుస్తకాలు పంపిణీ చేయడం లేదు. దగ్గరుండి నారాయణ స్కూళ్లు ప్రోత్సహిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే, పేదలు ఎవ్వరూ తమ పిల్లలను బడికి పంపలేదు. నారాయణ స్కూళ్లలో ఇప్పటికే ఎల్కేజీకి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఆ ఫీజు లక్ష రూపాయలకు చేరుతుంది.
– ఇప్పటికే కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు. ఇక ముందు వీరబాదుడే.
– ఇక ముందు పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులుండవు.
2014కు ముందు రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ కార్డులుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని 36 లక్షలకు తగ్గించాడు. కాబట్టి ఆయనకు మళ్లీ ఓటేస్తే అవేవీ ఉండవు.
– ఇప్పటికే భూములు, ఇళ్లు ఇష్టానుసారం లాక్కోవడానికి భూసేకరణ చట్టం సవరించారు. వెబ్‌ల్యాండ్ పేరిట రికార్డులు తారుమారు చేస్తున్నారు. రికార్డులు మాయం చేస్తున్నారు.
మళ్లీ పొరపాటున ఓటేస్తే, ఆయన ఇష్టం వచ్చినట్లు ఇళ్లు, భూములు లాక్కుంటారు.
– ఇప్పటికే ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు ఏవీ వదలకుండా దోచేస్తున్నారు. మళ్లీ ఓటేస్తే అవేవీ మిగలవు.
– లారీ ఇసుక ఇప్పటికే రూ.40 వేలుంది. అది లక్ష రూపాయలవుతుంది.
– గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మాఫియాలా మారాయి. అవి ప్రతి పనికి లంచం తీసుకుంటున్నాయి. ఎవరైనా పెన్షన్ కావాలంటే, ఏ పార్టీకి చెందిన వారని అడుగుతున్నాయి.
మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే, జన్మభూమి కమిటీలు మనందరి జీవితాలను శాసిస్తాయి. మీరు ఏ సినిమా చూడాలో, టీవీ ఛానల్ చూడాలో, ఏ పత్రిక చదవాలో, పిల్లలను ఏ స్కూల్‌కు పంపాలో, వైద్యం కోసం ఏ ఆస్పత్రికి వెళ్లాలో కూడా వారే నిర్దేశిస్తారు. అలా అయితేనే ఇల్లు, రేషన్ ఇస్తామని అంటారు.
– సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఏవీ ఉండవు
1994 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సీఎం కాగానే, సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేశారు. రెండు రూపాయల కిలో బియ్యం ధర రూ.5.25 చేశారు.
– పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రాకపోగా, ఇచ్చే ఇతక రుణాలపై వడ్డీని బాదుతారు.
– రైతులకు కూడా బ్యాంకుల రుణాలు బంద్ అవుతాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు.
– గ్రామాలలో తనను వ్యతిరేకించే వారెవ్వరినీ చంద్రబాబు బతకనివ్వడు.
ఇప్పటికే అన్ని చోట్లా తన పోలీసులను పెట్టుకుంటాడు. సీబీఐని, ఈడీని రానివ్వడు. ఇప్పటికే మొత్తం మీడియాను కొనేశాడు. అందుకే ఎవరిని చంపినా ఎక్కడా బయటకు రాదు. కేసులూ ఉండవు.మన మనుషులను చంపి, తిరిగి మనమే చంపామని ప్రచారం చేస్తారు.
చంద్రబాబు ప్రచారాలు నమ్మితే?
అని వివరించిన శ్రీ వైయస్ జగన్, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రచారాలు, చూపుతున్న సినిమాలు, చేస్తున్న ప్రసంగాలు, ఇస్తున్న వాగ్ధానాలు నమ్మితే.. ‘నర మాంసం తినే ఒక అందమైన రాక్షసిని నమ్మితే’ ఏం జరుగుతుందో.. అదే జరుగుతుందని ఉదహరించారు.
మళ్లీ మోసపోవద్దు
ఇప్పటికే ఒకసారి ఓటేసి మోసపోయామని, కాబట్టి చంద్రబాబుకు రెండోసారి మళ్లీ ఓటేసి, మళ్లీ మోసపోవద్దని అన్నారు.
విశ్వసనీయత రావాలి
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలని, విశ్వసనీయత, నిజాయితీ రావాలని.. ఎన్నికల ముందు ఒక నాయకుడు ఏదైనా చెప్పి, ఎన్నికల ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ నాయకుడు తనంతట తాను పదవిని వీడి, రాజీనామా చేసి, ఇంటికి పోవాలని, అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ వస్తాయని జననేత స్పష్టం చేశారు.
మళ్లీ డ్రామాలు
ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం, డ్రామా ఉండదంటూ.. ఇది ధర్మం–అధర్మం మధ్య సాగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. నిజానికి ఈ యుద్ధం ఒక్క చంద్రబాబు నాయుడుతో మాత్రమే కాదని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, చంద్రబాబుకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు.
గ్రామాలకు మూటల డబ్బులు
ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.
వారికి ఇవన్నీ వివరించండి
‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని గుర్తు చేయండి. అందుకే 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’.
‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి’.
‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.
‘పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్పండి. వారిలో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కకు చెప్పండి.. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆ తర్వాత వైయస్సార్ చేయూత పథకం తెస్తున్నాడు. ఆ పధకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మరీ మరీ చెప్పండి’.
‘గ్రామాల్లో ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఓటేసి 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడగండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 ఇస్తాడని, ఆ విధంగా నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.
‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్ గురించి ఆరా తీయండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్ వచ్చేది కాదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్ ఇచ్చేవాడా?’ అని అడగండి.
‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.
‘ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. మళ్లీ పేదలకు ఇళ్లు రావాలంటే, మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే అది జగనన్నకే సాధ్యమని, ఆయనే రాజన్న రాజ్యంలో మాదిరిగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’. అని శ్రీ వైయస్ జగన్ కోరారు.
నవరత్నాలు
నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట వాణితో పాటు, పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.













