YCP Stand: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..? మూడు రాజధానులకే కట్టుబడి ఉందా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా ఉంటూ వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించింది. భూసేకరణ, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టింది. ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ (YCP) కూడా అమరావతి రాజధాని ప్రతిపాదనకు సమ్మతించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో అనూహ్య మలుపు తీసుకుంది. మూడు రాజధానుల ( 3 Capitals) ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ నిర్ణయం అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపింది. దీని వల్ల నిర్మాణ పనులు స్తంభించాయి. ఇప్పుడు 2024లో ఎన్డీఏ కూటమి (NDA Govt) మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి దాని పునర్నిర్మాణానికి సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమరావతి ప్రాజెక్టును రీలాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటనేది ఆసక్తి కలిగిస్తోంది.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, అమరావతి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు అవసరమని, ఇది రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి మించిన భారమని వాదించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఆలోచనను తెరపైకి తెచ్చారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయం అమరావతి రైతులు, పెట్టుబడిదారులలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ఒకే రాజధానిపై ఆధారపడితే ఇతర ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడతాయని, మూడు రాజధానుల ద్వారా రాష్ట్రవ్యాప్త అభివృద్ధి సాధ్యమని వైసీపీ వాదించింది. అయితే.. వైసీపీ ప్రతిపాదనకు చట్టపరంగా, రాజకీయంగా అనేక అడ్డంకులు ఎదుయ్యాయి. దీంతో అమరావతి ప్రాజెక్టు ఐదేళ్లుగా స్తబ్ధంగా మిగిలిపోయింది.
2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా పునఃప్రకటించారు. డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) అమరావతి అభివృద్ధి పనులను ఆమోదించింది. అందులో భాగంగానే ప్రధాని మోదీ రేపు అమరావతి ప్రాజెక్టును రీలాంచ్ చేయనున్నారు. మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాష్ట్ర రాజధాని అంశంలో కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను కూడా ఈ పునఃప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపారు. ఈ సందర్భంలో వైసీపీ వైఖరిపై రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మూడు రాజధానుల సిద్ధాంతానికి వైసీపీ ఇంకా కట్టుబడి ఉందా.. లేకుంటే అమరావతికి అంగీకరిస్తుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి కానీ, ఆ పార్టీ నేతల నుంచి కానీ ఇటీవల రాజధానిపై బహిరంగ ప్రకటనలు రాలేదు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఈ ఏడాది మార్చిలో అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు అవసరమని, అందుకే అప్పుడు మూడు రాజధానులను ప్రతిపాదించామని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత స్టాండ్ ఏంటనేదానిపై క్లారిటీ లేదు.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం.. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా నేతల రాజీనామాలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఒత్తిడికి తలొగ్గి మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి అమరావతికి జైకొడితే తమ విశ్వసనీయతను ఫణంగా పెట్టినట్లవుతుంది. అయితే గతంలో అమరావతికి జైకొట్టి తర్వాత మాట మార్చడంపై ఇప్పటికే వైసీపీపై అనేక విమర్శలు వస్తున్నాయి. వైసీపీ కూడా అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు రాష్ట్రం మరోలా ఉండేదనే వాళ్లున్నారు. మరి ఇప్పుడు వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.