వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు..
ఐదేళ్లపాటు పాలన సాగించిన నాటి సీఎం జగన్.. ప్రజావేదిక విధ్వంసంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోయారు. అందులో భాగంగా వివిధ కేసుల్లో అప్పటి విపక్షనేత చంద్రబాబు సహా పార్టీలో సీనియర్లను జైలుకు పంపడమో.. కోర్టు కేసుల్లోకి లాగడమో జరిగింది. ఎందుకలా అనాల్సి వస్తుందంటే… ఇప్పుడు ఏపీలో ఉన్న అధికారులు.. ఏపార్టీ అధికారంలో ఉంటే వారు చెప్పినట్లే చేస్తున్నారు. ఇది తప్పు, ఇది అన్యాయం దీన్ని నేను చేయను అని ఎవరూ స్పష్టంగా రాసివ్వడం లేదు. దీనికి తోడు స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకుందాం.. తక్కువ కాలంలో కోటీశ్వరులు అయిపోదామన్న దురాశ కూడా దీని కారణమవుతోంది. దీన్ని అనువుగా మార్చుకుంటున్న అధికారపక్షాలు.. ప్రత్యర్థులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి.
ఇప్పుడు అధికారం చేతులు మారింది. కూటమి సర్కార్ పవర్ లోకి వచ్చింది. దీంతో పాతఫైళ్లను ప్రస్తుత ప్రభుత్వం వెలికితీస్తోంది. దీనిలో మరీ ముఖ్యంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం అంశంపై ఫోకస్ పెట్టింది.‘ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసి.. ఆ అనుమతులు రాకముందే నిర్మాణం ప్రారంభించేసింది వైసీపీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో అధికారంలో ఉన్నది. రాజధాని నుంచి చిన్న చిన్న గ్రామ సచివాలయాల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వేదంలాగా చెల్లుబాటు అవుతోంది. వారి మాటకు ఎదురు చెప్పగల వారు లేరు. వారు ఆదేశిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా సరే.. ఆ మిషమీద అడ్డు చెప్పగల ధైర్యం అధికారుల్లో ఎవ్వరికీ లేదు. చెప్పింది చేసుకుంటూ పోవడమే తమ బాధ్యత అన్నట్టుగా అధికార వర్గాలు అయిదేళ్లు పనిచేశాయని అనేక విమర్శలు వచ్చాయి.
కానీ ప్రస్తుతం జిల్లాల్లో నిర్మాణంలో వైసీపీ కార్యాలయాల్ని కూల్చివేసే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే.. ప్లాన్లకు అప్రూవల్స్ రావడానికంటె ముందే నిర్మాణాలు ప్రారంభించేశారు. వారు తలచుకుంటే అప్రూవల్ తీసుకోవడం చిటికెలో పని అయి ఉండేదేమో. కానీ.. మనల్ని అడిగేదెవరు.. అనే అహంకారం వల్ల వారు అప్రూవల్స్ గురించి పట్టించుకోలేదు. తమంతట తాము నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఆ అతివిశ్వాసమే ఇవాళ దెబ్బకొట్టిందన్న భావన సాక్షాత్తూ వైసీపీనేతల్లోనే వ్యక్తమవుతోంది..
అనుమతులు లేవు అనే సాకు చూపించి.. కార్యాలయాల భవనాలను తెలుగుదేశం ప్రభుత్వం కూల్చివేస్తోంది. కూల్చివేయడానికి నోటీసులు ఇస్తోంది. వైసీపీ నాయకులు తాము అధికారంలో ఉండగానే కొద్దిగా జాగ్రత్త పడి, ప్లాన్ల అనుమతులకు దరఖాస్తు చేసిన వెంటనే, అనుమతులు తీసేసుకుని ఉంటే.. ఇప్పుడు ఈ సమస్య తలెత్తేదే కాదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.పోనీ ఏమైనా అధికారపక్షంతో మాట్లాడే పరిస్థితి ఉందా.. అంటే, అసలు ఆపరిస్థితికి అవకాశం లేకుండా వైసీపీ పాలన చేసిందన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.













