టీడీపీ ట్రాప్ ..?
టీడీపీ ట్రాప్ లో వైసీపీ చిక్కుకుంటోందా..? అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తీవ్రవాదుల నుంచి తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని విపక్షనేత చంద్రబాబు.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. టీడీపీ నేతలు సైతం.. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మీడియా ముఖంగా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల్లో సైతం చాలా విషయాలు పొందుపర్చలేదని ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు.. టీడీపీ నేతలపై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. ఇవి కాస్తా.. ఇప్పుడు శృతి మించి మొదటికే మోసం తెస్తున్నట్లు కనిపిస్తోంది.
జైలులో ఉన్న ఖైదీకి రాచమర్యాదలు ఎలా జరుగుతాయని గతంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్ వేశారు. అయితే అది కాస్తా, ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ లా మారింది. ఎవరూ ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. రెండోసారి జగన్ సీఎం అయితే.. జైల్లోనే చంద్రబాబు చస్తాడని ఎంపీ గోరంట్ల మాదవ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఆ తర్వాత ఆయన తన మాటల్ని సవరించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. కానీ .. అవి నేరుగా ప్రజల్లోకి చేరిపోతున్నాయన్న విషయాన్ని వైసీపీనేతలు గుర్తించిన పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పుడు టీడీపీ నేతలు.. తాము చేసిన ఆరోపణలు నిజమేనని చెబుతున్నారు. దీనికి వైసీపీ నేతలు, ముఖ్యంగా మాదవ్ వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. చంద్రబాబును జైల్లోనే చంపించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీన్ని వైసీపీ నేతలు, రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఖండిస్తున్నారు. జైలు దగ్గర ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తున్నామని.. అలాంటిపరిస్థితులు లేవంటున్నారు. అంతే కాదు… చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యబృందం పరిశీలిస్తోందని చెబుతున్నారు.
అయితే.. తమ క్యాడర్, నేతలు చేస్తున్న విమర్శల్ని వైసీపీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోవడం లేదా..? ఎంత కాదన్నా విపక్ష నేత. ఓ ప్రధాన పార్టీకి అధ్యక్షుడు కూడా. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు లాజిక్ లేకుండా మాట్లాడితే ఎలా? కచ్చితమైన సమాచారంతో మాట్లాడి కన్విన్స్ చేయాల్సిందిపోయి… ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపించడం అధికార పార్టీ వైసీపీకి మైనస్ అయ్యే ప్రమాదముందని ఆపార్టీ నేతలే ఇన్ సైడ్ గా చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాటికి అధిష్టానం అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. లేదంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.













