రోజాపై వైసీపీ హైకమాండ్ సీరియస్..!?
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లై ఫైర్ బ్రాండ్ గా పేరొందారు రోజా. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. జగన్ కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. సినీరంగంలో లభించిన చరిష్మా, వాక్చాతుర్యం రోజాకు ప్లస్ పాయింట్స్. అయితే రోజా కామెంట్సే అప్పుడప్పుడు ఆమెకు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. దూకుడుగా, ఆవేశంగా మాట్లాడే రోజా కొన్ని సందర్భాల్లో ఆమె తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చినట్లు వైసీపీలో టాక్ నడుస్తోంది. చంద్రబాబు ఎపిసోడ్ లో రోజా దూకుడుపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.
టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించడంలో రోజా ముందుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఎటాక్ చేస్తుంటారామె. సందర్భం ఏదైనా టీడీపీ, జనసేనపై మాట్లాడాలంటే రోజా ముందుంటారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు అరెస్టయితే రోజా ఆనందానికి హద్దులుండవు. అందుకే అరెస్ట్ అయిన వెంటనే నగిరిలోని తన నివాసంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. పీడ విరగడైందని కామెంట్స్ చేశారు. మిగిలిన వైసీపీ నేతలందరూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నామంటే.. రోజా సెలబ్రేషన్స్ మాత్రం పీక్స్ కి చేరాయి. ఆ తర్వాత పవన్ పైన, బ్రాహ్మణి పైన కూడా రోజా రెచ్చిపోయారు.
వాస్తవానికి రోజా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే ఆమెకు ఫోన్ చేసి అలాంటి పనులు చేయొద్దని వారించారట. అంతేకాక.. ప్రధాన మీడియా సంస్థలకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి రోజా సెలబ్రేషన్స్ ఐటెం వాడొద్దని కోరారట. దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనేది ఆయన ఉద్దేశం. అయితే అంతటితో ఆగని రోజా.. పవన్ కల్యాణ్, బ్రాహ్మణి పైన మరోసారి ఫైర్ అయ్యారు. బ్రాహ్మణి ఇంతకాలం రాజకీయాల్లో లేరు. చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు. అలాంటి ఆమెను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీకి మేలు జరగకపోగా కీడు జరుగుతుందనేది హైకమాండ్ ఆలోచన.
చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ కక్ష గట్టి ఈ పని చేసిందనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తమవుతోందని వైసీపీ అంతర్గత సర్వేల్లో వెల్లడవుతున్నట్టు సమాచారం. దాంతో అతి చేయవద్దని రోజాకు సూచించారు సజ్జల. అలా చేస్తే సింపతీ మరింత పెరిగిపోతుందని.. పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. బ్రాహ్మణిని టార్గెట్ చేశారు. ఇప్పుడు బ్రాహ్మణిపైన జనాల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాంటామెపైన కామెంట్స్ చేస్తే జరిగే నష్టం మామూలుగా ఉండదు. రోజా తెలిసి చేస్తోందో.. తెలియక చేస్తోందో వైసీపీ నేతలకు అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత కూడా ఆమె పదేపదే ఇలా చేస్తుండడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.













