YCP: సొంత సైన్యంపై దృష్టి పెట్టిన వైసీపీ.! కన్సల్టెన్సీలకు స్వస్తి..!!

2019లో వైసీపీ (YCP) అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ (Prasanth Kishor) నేతృత్వంలోని ఐప్యాక్ (IPAC) కారణం. ప్రశాంత్ వ్యూహాలు ఆ పార్టీకి చాలా దోహదపడ్డాయి. అధికారంలోకి రాగలిగింది. ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ నుంచి వైదొలిగిన తర్వాత రిషిరాజ్ సింగ్ (Rishiraj Singh) నేతృత్వం వహించారు. వైసీపీకి రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐప్యాక్ 2024 వరకూ పనిచేసింది. 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐప్యాక్ చక్రం తిప్పింది. అన్నీ తామై వ్యవహరించింది. తాము చెప్పినట్లే అటు పార్టీ, ఇటు ప్రభుత్వం పనిచేయాలనేలా ఎదిగింది.
అయితే 2024 ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలు ఫలించలేదు. వైనాట్ 175 అంటూ క్యాంపెయిన్ చేసిన ఐప్యాక్, బొక్కబోర్లా పడింది. కేవలం 11 సీట్లకు పరిమితమైపోయింది. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అంచనా వేయకుండా ఓవర్ బిల్డప్ ఇవ్వడం వల్లే వైసీపీ ఓడిపోయిందని అంచనాకు వచ్చారు. ఐప్యాక్ వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సిద్ధం సభలతో గెలిచేస్తున్నామని బిల్డప్ ఇచ్చిన ఐప్యాక్, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం కావడమే ఓడిపోవడానికి కారణమని అంచనాకు వచ్చారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఐప్యాక్ మరోసారి వైసీపీకి పని చేసేందుకు సిద్ధమైంది. అయితే హైకమాండ్ మాత్రం ఈసారి ఐప్యాక్ సేవలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చింది. కన్సల్టెన్సీలతో అవసరం లేకుండా కేవలం కేడర్ ను నమ్ముకుంటేనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే దాదాపు 15లక్షల మంది పార్టీలో క్రియాశీలంగా పనిచేసే అవకాశం ఉంటుందని అంచనా. అందుకే ఆ దిశగా పార్టీ పనిచేస్తోంది.
జగన్ (YS Jagan) కార్యకర్తలను పట్టించుకోకుకండా కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ మాటలను నమ్మడం వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు, కార్యకర్తలే చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ కూడా ఈ విషయాన్ని గ్రహించారు. అందుకే ఇకపై కన్సల్టెన్సీలతో పనిలేకుండా సొంతంగానే పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎక్కువ సమయం గడిపేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. జగన్ బయటకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. దీన్ని కాపాడుకోగలగితే వచ్చే ఎన్నికల్లో గెలవడం చాలా ఈజీ అనే భావనకు పార్టీ వచ్చినట్టు సమాచారం.