రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పచ్చదనం అభివృద్ది పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం-మందడం గ్రామాల మధ్య సీడ్ యాక్సిస్ రహదారిని అనుకొని వున్న ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ముఖ్యమంత్రి అక్కడి విద్యార్థులతో మమేకమయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు తమ విజయమని అన్నారు. రాజధానిని నిర్మించుకొనేందుకు అభ్యంతరాలు లేవంటూ ఎన్జీటీ తీర్పిచ్చిందన్నారు.
నది పక్కన నిర్మాణం చేస్తామంటే కొందరు అనేక అడ్డంకులు పెడుతున్నారని దుయ్యబట్టారు. యజ్ఞాన్ని అడ్డుకొనే రాక్షసుల్లా కొందరు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం మాత్రం ఆగదని తేల్చి చెప్పారు. అమరావతి ప్రాంతంలో పచ్చదనం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఫలాలు ప్రజలకు అందించి తీరుతామన్నారు. 99శాతం మంది ఓ వైపు ఉంటే, ఆ ఒక్కరు మరోవైపు ఉంటున్నారని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మించి తీరుతామని సృష్టం చేశారు.













