Annadata Sukhibhava: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ లిస్టులలో తేడాలు ఎందుకు?

ఏపీ లో రైతులకు అందుబాటులో ఉన్న రెండు ప్రధాన పెట్టుబడి సాయపు పథకాలు అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) , పీఎం కిసాన్ (PM-KISAN) విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకే లబ్ధిదారుడు ఈ రెండు పథకాల కింద లబ్ధిదారుల వివరాలు ఒకటిగా ఉండాల్సి ఉన్నప్పటికీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. రైతులెందరో ఒక పథకంలో లబ్ధి పొందుతుంటే, మరొకటి వారికి అందకుండా పోతుంది. దీంతో పరిస్థితి అర్థం కాని రైతులు రైతు సేవా కేంద్రాల (Rythu Seva Kendras) చుట్టూ తిరుగుతూ, తమ సందేహాలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారి సమస్యలకు సరైన సమాధానం అందించేవారు ఎవరూ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుఖీభవ పథకానికి ఒక జాబితా ఉండగా, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకానికి మరో జాబితా ఉంది. రెండు పథకాల లక్ష్యం ఒకటే – రైతులకు పెట్టుబడి సాయం అందించడమే అయినప్పటికీ, లబ్ధిదారుల ఎంపికలో సమన్వయం లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు వచ్చిన రైతులందరికీ సుఖీభవ కింద వచ్చే రూ.5 వేలు జమ కాలేదు. అలాగే, సుఖీభవ పొందిన చాలా మంది రైతులు పీఎం కిసాన్‌కు అనర్హులుగా మారారు. రైతులు “ఒక పథకం అర్హత ఉంటే మరొకటి ఎందుకు వర్తించదు?” అని ప్రశ్నిస్తున్నారు.
ఈకేవైసీ (eKYC), ఇంటి మ్యాపింగ్, 1బీ నమోదు వంటి సాంకేతిక కారణాలతో వేలాదిమంది రైతుల పేర్లు తొలగించబడ్డాయి. వారు పీఎం కిసాన్ కింద అర్హత పొందినప్పటికీ, సుఖీభవ నుంచి వంచితులయ్యారు. అంటే ఒకే రైతుకు ఒకదానిలో ఈకేవైసీ జరిగితే, మరొక పథకానికి ఎందుకు కాలేదు? అన్నది ఇప్పటికీ పరిష్కారమవని ప్రశ్న. మ్యాపింగ్ అయిన రైతులు కూడా సుఖీభవ సాయం పొందలేకపోవడం మరో అర్థరహిత వ్యవస్థను సూచిస్తుంది.
పల్నాడు (Palnadu) జిల్లాలో 37,681, బాపట్ల (Bapatla) జిల్లాలో 17,241, గుంటూరు (Guntur) జిల్లాలో 13,942 మంది రైతులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 68,864 మంది రైతులకు మొదటి విడత సుఖీభవ సాయం జమ కాలేదు. కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో, రెండు పథకాల జాబితాలను సమీక్షించి అర్హులకు రెండు పథకాల సాయం అందేలా చర్యలు తీసుకోవడం అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుందన్న నమ్మకం రైతుల్లో పుట్టుతుంది. అప్పటివరకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ పూర్తిగా నెరవేరినట్టు పరిగణించబడదు అని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..